మహిళా ప్రధాని మంచంపై కుర్రాళ్లు, పార్లమెంట్ లో సిగరెట్లు... ఫోటోలు వైరల్!

ప్రస్తుతం బంగ్లాదేశ్ కు సంబంధించి నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫోటోలు చూశాక.. శ్రీలంక లో రాజపక్సే కి వచ్చిన వ్యతిరేకత చిన్నదిగా అనిపించొచ్చు

Update: 2024-08-06 04:54 GMT

దేశ ప్రధాని మంచంపై పడుకుని మొబైల్ చూస్తున్న కుర్రాళ్లు, ఆ ప్రధాని నివాసంలోని చీరలు, బ్లౌజ్ లు ధరించి యువకులు హల్ చల్, పార్లమెంట్ భవనంలో ప్రజాప్రతినిధులు కొలువైన ఉండే చోట సిగరెట్లు కాలుస్తూ కనిపించిన యువత, రోడ్లపై తుపాకీల మోత, ప్రధాని ధరించిన చీరల చేతపట్టి రోడ్లపై ర్యాలీలు ఇవన్నీ చూశాక అది ప్రజాస్వామ్య దేశం అంటే కాస్త సందేహించాలా.. లేక, ప్రజాగ్రహం ఈ స్థాయిలో రావడానికి గల కారణాల్లోని సహేతుకతపై చర్చ జరపాలా?

ప్రస్తుతం బంగ్లాదేశ్ కు సంబంధించి నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫోటోలు చూశాక.. శ్రీలంక లో రాజపక్సే కి వచ్చిన వ్యతిరేకత చిన్నదిగా అనిపించొచ్చు.. ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్లు చేసిన సందడికి పోటీగానూ భావించొచ్చు అన్నట్లుగా మారిపోయింది బంగ్లాదేశ్ లో పరిస్థితి. ఎక్కడ చూసినా రోడ్లపై జనాలు.. దేశాన్ని విడిచి పారిపోయిన ప్రధాని.. ఇప్పుడు పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లిన స్థితి.. వెరసి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అవును... బంగ్లాదేశ్ లో గతకొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు పీక్స్ కి చేరాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె భారత్ కు చేరుకున్నారు. ఫలితంగా సైనికాధిపతి జనరల్ వకార్ - ఉజ్ - జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

బంగ్లాలో హిందువులు టార్గెట్ అయ్యారా?:

ఇలా చినికి చినికి గాలివానగా, పెను విపత్తులా మారిన బంగ్లాదేశ్ లోని రిజర్వేషన్లపై మొదలైన ఆందోళనలు ఇప్పుడు మతపరమైన దాడులకూ దారితీశాయి. ఇందులో భాగంగా... బంగ్లాలో ఇప్పుడు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలయ్యాయి. ఈ మేరకు అధికార అవామీ లీగ్ పార్టీ నేతలతో పాటు దేశంలోని హిందువులు, వారి ఆస్తులపైనా దాడులు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో "ఆల్ ఐఎస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా "వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్" ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, హిందువులను ఊచకోత కోస్తున్నారని ప్రకటించింది.

భారత్ కు కొత్త తలనొప్పి!:

బంగ్లాలో పరిస్థితులు చేజారిపోవడంతో ఆ దేశ ప్రధాని హసీనా.. భారత్ లో తలదాచుకునేందుకు వచ్చారు! ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్ లోని హిండిన్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా... ఆమెకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ స్వాగతం పలికారు! ఈ సందర్భంగా విమానాశ్రయంలోనే సుమారు గంటసేపు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అనంతరం ప్రధాని మోడీతో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ సమావేశమయ్యారు. పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఇదే క్రమంలో ప్రధానంగా షే హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో... భారత్ - బంగ్లా మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరగడంతో పాటు పలు జల పంపకాల వివాదాలూ పరిష్కారమయ్యాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగానూ హసీనా.. భారత్ తో కలిసి పనిచేశారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ... షేక్ హసీనా రాజీనామాతో మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పార్టీకి పాకిస్థాన్, చైనాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో.. ఈమె ఎంట్రీ భారత్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఎవరీ ఖలీదా జియా?:

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా పగ్గాలు చేపట్టేఅ అవకాశం ఉందని కథనాలొస్తున్న వేళ.. ఈమె రాక భారత్ కు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 1991-1996, 2001-2006 మధ్య ఈమె బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భారత వ్యతిరేక భావాలే పెట్టుబడిగా ఆమె ఇన్నాళ్లూ రాజకీయాలు నడిపిన పరిస్థితి.

అయితే బంగ్లాలో జరిగిన ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని, షేక్ హసీనాకు సహకరించిందని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆరోపించింది. ఈ సందర్భంగా "బాయ్ కాట్ ఇండియా" కు పిలుపునిచ్చింది. ఇలాంటీ వ్యవహారాలతో పాటు అధికార దుర్వినియోగం, మొదలైన కేసుల్లో ఖలీదా జియా 2018 నుంచి జైల్లోనే ఉన్నారు. అయితే ఆమెను విడుదల చేస్తూ ప్రెసిడెంట్ తాజాగా ఆర్డర్స్ విడుదల చేశారు.

ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా రాజీనామాతో త్వరలో ఖలీదా జియా ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో... భారత్ ను నిత్యం వ్యతిరేకించే ఈమె పాలనలో ఎలాంటి కొత్త తలనొప్పులు వస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News