"భౌ.. భౌ.. బార్క్" కుక్కలకూ ఉంది ఓ విమాన సర్వీసు..

పెంపుడు శునకాల కోసమే ప్రారంభమైన విమాన సేవ ఇది. వీరి తొలి విమానం అమెరికాలోని న్యూయార్క్ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ కు చేరుకుంది.

Update: 2024-05-26 11:30 GMT

మనుషులకు అనేక రకాల విమాన సర్వీసులు.. మరి వారు పెంచుకునే కుక్కలకు..? ఎంతో ప్రేమగా చూసుకునే శునకాలను ఎక్కడికైనా దూరప్రాంతాలకు తీసుకెళ్లాలంటే...? విమానాల్లో తీసుకెళ్లాలంటే.. తోటి ప్రయాణికులతో మహా ఇబ్బంది. అలాగని కుక్కలను వదిలేసి వెళ్లలేరు. మరి ఎలా..? ఇలాంటివారి కోసమే పుట్టింది ‘బార్క్ ఎయిర్’.

పెంపుడు శునకాల కోసమే ప్రారంభమైన విమాన సేవ ఇది. వీరి తొలి విమానం అమెరికాలోని న్యూయార్క్ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ కు చేరుకుంది. ఈ సర్వీసులోనే అన్ని టికెట్లు అమ్ముడవం విశేషం.

బార్క్ అంటే ఇంగ్లిష్ లో మొరగడం. కుక్కలు మొరుగుతాయి కాబట్టి వాటికి ఉద్దేశించిన విమాన సర్వీసుకు అదే పేరు పెట్టారు. వాస్తవానికి అమెరికాలోని బార్క్‌ అనే కంపెనీ శునకాల ఆహారం, ఆట బొమ్మలు తయారు చేస్తుంది. అయితే, ఓ జెట్‌ ఛార్టర్‌ సర్వీస్‌ సంస్థ తో కలిసి ‘బార్క్‌ ఎయిర్‌’ ను ప్రారంభించింది.

గత ఏప్రిల్ లో బార్క్ ఎయిర్ తన సర్వీసులను వెల్లడించింది. అయితే, యూకేలో దీనికంటే ముందే కే9 జెట్స్‌ అనే ప్రైవేటు సంస్థ శునకాల కోసం తొలిసారిగా విమాన సర్వీసులను ప్రారంభించింది. కాగా, బార్క్ ఎయిర్ సర్వీసుల్లో కుక్కలకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వీటితో కుక్కల యజమానులు కూడా ప్రయాణించొచ్చు. కానీ, మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ వసతులు ఉంటాయి.

కుక్కలకు ఇరుకు ఉండొద్దనే ఉద్దేశంతో.. విమాన సామర్థ్యం మొత్తానికి టికెట్‌ బుకింగ్‌ తీసుకోబోమని బార్క్‌ ఎయిర్‌ వెల్లడించింది.

బార్క్ ఎయిర్ విమానాల్లో కుక్కల కోసం ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. ప్రతీదాంట్లో మ్యూజిక్‌, లావెండర్‌ సెంట్‌ తువాళ్లు, సువాసనభరిత పాత్రలు, అవి సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులుంటాయి. ఆహారం, మెడ తాడు, మల మూత్రాల సంచులతో కూడిన ‘జస్ట్‌ ఇన్‌ కేస్‌’ పేరిట ప్రత్యేక సంచులు సిబ్బంది వద్ద సిద్ధంగా ఉంటాయి.

కుక్క బొమ్మలు..

విమాన ప్రయాణం మధ్యలో కుక్కలు ఆడుకునేందుకు బొమ్మలు, ప్రత్యేక ఏర్పాట్లు సరేసరి. 15 కుక్కలు, వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా బార్క్‌ ఎయిర్‌ విమానాలను రూపొందించారు. అయితే, 10 టికెట్లను మాత్రమే అమ్ముతారు.

Tags:    

Similar News