అభ్యర్థుల ఎంపిక మీటింగ్... క్యాండీ క్రష్ ఆడుతున్న సీఎం!

ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బఘేల్ మాత్రం క్యాండీ క్రష్ ఆడుతూ కుర్చూన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Update: 2023-10-11 12:55 GMT

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఈ ఐదురాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంటే... ఛత్తీస్ గఢ్ లో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయన్నమాట. అభ్యర్థుల ఎంపికలు, ప్రచార కార్యక్రమాలతో హోరెత్తుతున్న ఈ దశలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం క్యాండీ క్రష్ ఆడుతున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో... కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులూ, కార్యకర్తలూ అంత ఆ హీట్ లో ఉంటే ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బఘేల్ మాత్రం క్యాండీ క్రష్ ఆడుతూ కుర్చూన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోనీ ఖాళీగా కుర్చున్నప్పుడు ఆడుకుంటున్నారేమోలే అనుకుంటే పొరపాటే... అక్కడ జరుగుతున్నది అత్యంత కీలక సమావేశం కావడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... ఐదురాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్ గడ్ సీఎం & కో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా... ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కూల్ గా క్యాండీ క్రష్ గేం ఆడుకుంటూ కనిపించారు. దీంతో బీజేపీ - కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

ఇందులో భాగంగా... ఎంత ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని, ఆ విషయం సీఎం భూపేశ్ బఘేల్ కు తెలుసని, అందుకే ఆయన రిలాక్స్ అవుతున్నారని బీజేపీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన సమావేశంపై దృష్టి పెట్టే బదులు, క్యాండీ క్రష్ ఆడుకోవటమే మేలని ఆయన భావించి ఉంటారని ఎద్దేవా చేసింది.

అయితే బీజేపీ విమర్శలకు సీఎం బఘేల్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. గతంలో తాను బైక్ నడిపినప్పుడు, ఛతీస్ గఢ్ సంప్రదాయ ఆటలు ఆడినప్పుడూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు. ఇప్పుడు సమావేశానికి ముందు తాను క్యాండీ క్రష్ ఆడుతున్న ఫోటోలను షేర్ చేస్తూ విమర్శలు చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా తన ఉనికే వాళ్లకు నచ్చడం లేదని తెలిపిన ఆయన... అధికారంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించేది ప్రజలే అని పేర్కొన్నారు. ఇదే సమయంలో సాంప్రదాయ ఆటలతో పాటు క్యాండీ క్రష్ వంటి ఆన్ లైన్ గేం కూడా తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ రచ్చ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News