13 రోజులు-13 నెలలు-13 మంది సభ్యులు: బీజేపీలో హాట్ టాపిక్
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం దక్కించుకుంది.
బీజేపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. '13'. దీని చుట్టూనే కమల నాథుల రాజకీయం తిరుగుతోంది. ఎందుకో కానీ.. ఈ 13 అనేది బీజేపీకి అస్సలు కలిసి రావడం లేదని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇంతకీ.. ఇంత పెద్ద ఎత్తున అటు జాతీయ స్థాయి నుంచి ఇటు రాష్ట్రాల స్థాయి వరకు ఎందుకు 13 హాట్ టాపిక్ అయిందని చూస్తే.. దీని వెనుక చాలా కథే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం దక్కించుకుంది. ఇది జరిగి పది రోజులు అయింది. నవంబరు 23న వచ్చిన ఎన్నికల ఫలితం.. మహాయుతికి ప్రజలు పట్టం కట్టారని తేల్చి చెప్పింది.
దీంతో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి సీటు సహా.. హోం శాఖ పగ్గాల విషయంలో కూటమి పార్టీల నాయకుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. సీఎం సీటును వదులుకునేది లేదని కూటమి పార్టీ శివసేన స్పష్టం చేసింది. ఏదో ఒక విధంగా ఆ పార్టీని బ్రతిమాలారు. కానీ, హోం శాఖ విషయంలో మరోసారి రగడ చోటు చేసుకుంది. దీనిని ఇచ్చేది లేదని బీజేపీ చెప్పింది. కానీ, ఇది కూడా ఇవ్వకపోతే.. మేం ఎందుకని శివసేన పట్టుబట్టింది. మొత్తానికి అయిష్టంగానే బీజేపీ నేతలు హోం శాఖను శివసేనకు ఇచ్చేందుకు మొగ్గు చూపారు. దీంతో ప్రస్తుతానికి రగడ చల్లారింది.
ఈ మధ్యలోనే చిత్రమైన చర్చ బీజేపీలో తెరమీదికి వచ్చింది. అదే 13! ఆశ్చర్యంగా అనిపించినా నిజం. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమిగా వెళ్లినప్పటికీ.. ఆ పార్టీకి ఒంటరిగానే 132 సీట్లు దక్కాయి. కానీ, ఒంటరిగా అధికారం చేపట్టాలంటే.. మొత్తం స్థానాల్లో మేజిక్ ఫిగర్ దక్కించుకోవాలి. అది.. 288 సీట్లలో 145. అంటే.. బీజేపీకి వచ్చిన 132 సీట్లకు 13 కలపాలి. ఈ పదమూడు లేకపోవడంతోనే ఇప్పుడు మహాయుతి కొనసాగుతోంది. అలా కాకుండా..ఏపీలో మాదిరిగా.. టీడీపీ ఒంటరిగా తెచ్చుకున్నట్టుగా(134) బీజేపీకనుక 145 సీట్లు తెచ్చుకుని ఉంటే.. ఇప్పుడు కూటమి ఉండేది కాదని బీజేపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఆ 13 సీట్లు బీజేపీకి రాలేదు.
ఈ నేపథ్యంలోనే తమకు 13కు మధ్య చాలా చరిత్ర ఉందని అంటున్నారు బీజేపీ నాయకులు. గతంలో వాజపేయి ప్రభుత్వం 13 రోజుల పాలన తర్వాత.. కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా అనంతరం ప్రబుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆయన 13 నెలల తర్వాత.. మిత్ర పక్షం మమతా బెనర్జీ కాడి పడేయడంతో సర్కారు కుప్పకూలిపోయింది. అంటే.. 13 రోజులు, 13 నెలలు వాజపేయి ప్రభుత్వం చాలానే ఇబ్బందులు పడింది. తర్వాత.. పూర్తి మెజారిటీతో విజయం దక్కించుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ కేవలం 13 మంది సభ్యుల కొరత కారణంగానే.. బీజేపీ మహాయుతి మిత్ర పక్షాలను బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చిందని కమల నాథులు ఆపశోపాలు పడుతుండడం గమనార్హం.