ఇంతకీ ఏపీలో బీజేపీ పొత్తు ఉందా.. లేదా?

తాజాగా బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ పొత్తులపై స్పష్టత ఇస్తారనుకున్నా అది జరగలేదు.

Update: 2024-02-29 09:39 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయనున్నాయి.

అయితే మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇంకా ఏం తేల్చడం లేదు. ప్రస్తుతం తమకు జనసేన పార్టీతోనే పొత్తు ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో కూడా పొత్తు పెట్టుకునే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని అంటున్నారు.

తాజాగా బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ పొత్తులపై స్పష్టత ఇస్తారనుకున్నా అది జరగలేదు. పైగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒంటరిగా పోటీ చేసి బలపడటానికే బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు.

మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి పొత్తు గురించి బీజేపీ పెద్దలకు వివరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ దిశగానూ ముందడుగు పడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫిబ్రవరి మొదట్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి వచ్చారు. ఆయన ఏం చర్చించింది బయటకు రాలేదు. అలాగే బీజేపీ పెద్దలు కూడా వెల్లడించలేదు.

ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ కూడా వెలువడవచ్చని సంకేతాలు ఉన్నాయి. అయినా ఇప్పటివరకు బీజేపీ పొత్తు విషయంలో ఏమీ తేల్చిచెప్పడం లేదు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

బీజేపీ కూడా తమతో కలసి వస్తుందని భావిస్తుండటం వల్లే టీడీపీ, జనసేన ఇంకా 57 సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదని అంటున్నారు. అలాగే పార్లమెంటు సీట్లకు కూడా టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ పొత్తు విషయాన్ని తేల్చిచెబితే ఈ సీట్లలో ఎవరెన్ని పోటీ చేస్తారో స్పష్టత వస్తుందని అంటున్నారు.

అయితే బీజేపీ మాత్రం పొత్తు లేదన్నట్టే వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. పొత్తుల విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. తాము మాత్రం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒంటరిగానే పనిచేస్తుందని ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా కూడా ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో మరోసారి మోదీ ప్రధాని కావాలని జనసేనాని పవన్‌ ఆకాంక్షించారు.

పురందేశ్వరి మాత్రం తాము ఏపీలో ఒంటరిగానే వెళ్తామనే సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ బలమైన పార్టీగా అవతరిస్తుందని అంటున్నారు. బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఒంటరిగా పోటీ చేయడానికే బీజేపీ సిద్ధమైందని చెబుతున్నారు.

మరోవైపు గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు మాత్రం పొత్తును కోరుకుంటున్నారు. పొత్తు అంశంపై తమ పార్టీ అధిష్టానం కూలంకుషంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇలా బీజేపీ పొత్తు విషయంలో మిశ్రమ సంకేతాలు ఇస్తోంది. దీంతో టీడీపీ, జనసేన పార్టీలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Full View
Tags:    

Similar News