మోడీ ఇలా చేశారేంటి? తెలంగాణ బీజేపీ గాలి తీసేసిన మోడీ !
అంటే.. మొత్తంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు దాదాపు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి.. ప్రజల ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి
మూలిగే నక్కపై తాడికాయ పడిన చందంగా మారింది తెలంగాణ బీజేపీ నాయకుల పరిస్థితి. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు.. కొత్తవాటి ప్రకటనలతో అధికార పార్టీ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నా రు. ఇక, ఇదే వరుసలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా.. దూకుడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించి సక్సెస్ అయిన.. నాయకులు ఈ సభావేదిగా ఇచ్చిన గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే.. మొత్తంగా అటు బీఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు దాదాపు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి.. ప్రజల నుప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే.. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టాలని, దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన తెలంగాణలో పదవిలోకి వచ్చేయాలని ఆశలు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు అంతర్గత కుమ్ములాటలతో పొద్దు పుచ్చుతున్నారు.
ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడడం ఎలా? అనేది ఇప్పుడు రాష్ట్ర కమలనాథులకు పెద్ద చిక్కుగా మారింది. ఇంతలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలు.. మరింతగా బీజేపీకి డ్యామేజీగా మారాయనే చర్చ తెరమీదికి వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ప్రధాని పదే పదే రాష్ట్ర విభజనను తప్పుపట్టడం.. తెలంగాణలో రక్తం పారిందని వ్యాఖ్యానించడంపై నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
''మేం ఆయుధాలు సమకూర్చుకోవడం కాదు. ప్రత్యర్థులకు ఆయుధాలు ఇస్తున్న పరిస్థితిలో ఉన్నాం. ఏం చెప్పాలి?'' అని ఒక కీలక నాయకుడు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇక, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికే మోడీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇక, ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో ఊరూవాడా..తెలంగాణ సెంటిమెంటును బీజేపీ దెబ్బతీస్తోందనే ప్రచారానికి కూడా బీఆర్ ఎస్ తెరదీస్తోంది. దీంతో బీజేపీ ఉసురు తీసే పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నాయకులు తల్లడిల్లుతుండడం గమనార్హం.