10 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా ?
తెలంగాణా ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్నది బీజేపీ ఆరాటం. అయితే అందుకు పరిస్ధితులు అనువుగా ఉన్నాయా అంటే అనుమానమే
తెలంగాణా ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలన్నది బీజేపీ ఆరాటం. అయితే అందుకు పరిస్ధితులు అనువుగా ఉన్నాయా అంటే అనుమానమే. అందుకనే బుర్రకు తోచిన హామీలిచ్చేసింది. బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో శనివారం విడుదలచేశారు. మ్యానిఫెస్టోలో కీలకమైనది ఏమిటంటే ప్రతి ఏడాది అచ్చంగా మహిళలకే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీఇచ్చారు. నిజానికి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్నదే తప్పుడు హామీ. అలాంటిది తప్పుడు హామీలో కూడా మహిళలకే 2 లక్షల ఉద్యోగాలంటే ఎవరు నమ్ముతారు ?
మహిళలకే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తామంటే ఇక మగవాళ్ళు ఏమవ్వాలి ? ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటే ఐదేళ్ళల్లో పది లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే సాధ్యమేనా ? మ్యానిఫెస్టోలో మహిళలకు ఉద్యోగాలన్నారే కానీ శాశ్వతమా, కాంట్రక్టా లేకపోతే ఔట్ సోర్సింగా అని చెప్పలేదు. ఏ పద్దతిలో అయినా అన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యంకాదు. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వటమన్నది రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి మీద ఆధారపడుంటుంది.
ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం మీద ఆర్ధికభారం పడకతప్పదు. అందుకనే ఏ పార్టీ అధికారంలో ఉన్న ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తోంది. అంతెందుకు 2019 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ ఏడాదికి దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుగురించి మాట్లాడితే బీజేపీ సమాధానం చెప్పదు. పైగా ఇపుడిచ్చిన హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగమని కూడా చెప్పలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అని చెప్పింది. ప్రైవేటు రంగంలో మహిళల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం తానే ఇచ్చినట్లు ఎలా చెప్పుకోగలదు ?
మొత్తంమీద పార్టీలు పోటీపడి ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చేస్తున్నాయి. ఇస్తున్న హామీల్లో కనీసం పదోవంతు కూడా అమలుచేసే అవకాశాలు లేవని పార్టీలకు బాగా తెలుసు. అయినా జనాలను పిచ్చోళ్ళకింద జమచేస్తున్నాయి కాబట్టి పార్టీలు ఇష్టంవచ్చిన హామీలు మ్యానిఫెస్టో రూపంలో ఇచ్చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటేనే కేంద్ర ఎన్నికల కమీషన్ సాధ్యంకాదని చేతులెత్తేసింది. తప్పుడు హామీలివ్వకుండా పార్టీలను నియంత్రించే వ్యవస్ధ ఏర్పడేంత వరకు ఇలాంటి మ్యానిఫెస్టోలు వస్తుంటాయంతే.