కేటీఆర్ చూపు డీఎంకే వైపు...మ్యాటర్ సీరియస్సే !

తెలంగాణాలో ఓడిన బీఆర్ఎస్ లేవడానికి చూస్తోంది. అయితే రాజకీయాల్లో గాలి ఏటవాలుగా వీస్తేనే పడవ ప్రయాణం సాగుతుంది.

Update: 2024-08-21 03:50 GMT

తెలంగాణాలో ఓడిన బీఆర్ఎస్ లేవడానికి చూస్తోంది. అయితే రాజకీయాల్లో గాలి ఏటవాలుగా వీస్తేనే పడవ ప్రయాణం సాగుతుంది. కానీ అంతవరకూ పార్టీని పటిష్టం గా ఉంచుకోవాలి కదా. ఇపుడున్న రోజులలో పార్టీని నడపడం బహు కష్టం.

గెలిచిన పార్టీలలో జనాలు పెద్ద ఎత్తున వచ్చి చేరతారు. బెల్లం చుట్టూ మూగే ఈగల మాదిరిగా ఫుల్ లోడ్ తో అధికార పార్టీ బండి ఉంటుంది. కానీ ఒక్కసారి ఓడితే మాత్రం ఎవరూ కనిపించరు. ఓడిన పార్టీలో ఉంటూ అధికార పార్టీ పెట్టే వేధింపులను భరిస్తూ సొంత సొమ్ము ఖర్చు చేస్తూ కాలం మొత్తం ఖర్చు చేస్తూ నిజాయితీగా పనిచేసే వారు ఈ రోజులలో బహు కరవుగా ఉంది.

దాంతో ఓడిన పార్టీలను నిలబెట్టుకోవడం చాలా పెద్ద ప్రయత్నంగా మారుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తోంది. ఓటమి అనే పీడకల నుంచి ఎనిమిది నెలలు నెట్టుకుని వచ్చింది. ఇక మరో నాలుగేళ్ళ పాటు పార్టీని ధీటుగా నడపాలి.

దాంతో కొత్త స్ట్రాటజీలను అమలు చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఢక్కామెక్కీలు తిని రాజకీయంగా ఎనభయ్యేళ్ళ పాటు కొనసాగుతూ వస్తున్న అతి పెద్ద వృద్ధ పార్టీ డీఎంకే ఏ విధంగా ఇన్నేళ్ళ పాటు ఎలా పార్టీని కాపాడుకుంది అన్నది స్టడీ చేయడానికి బీఆర్ఎస్ ఉత్సాహం చూపిస్తోంది. డీఎంకె 1940 దశకం చివరిలో ఏర్పాటు అయిన పార్టీ. మొదట్లో సమిష్ఠి నాయకత్వం ఉన్నా 1970 తరువాత కరుణానిధి తన సొంత నాయకత్వంతోనే పార్టీని నిలబెట్టారు.

ఆయన నాయకత్వం గిట్టని ఎంజీఆర్ వంటి వారు వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇక 1977లో ఎంజీయార్ మొదటి సారి గెలిచాక ఆయన చనిపోయేంతవరకు అంటే 1988 దాకా డీఎంకే గెలుపు పిలుపు వినలేదు. అలా మూడు ఎన్నికల్లో వరసగా ఓటమి పాలు అయింది. అయినా ఆ పార్టీ తిరిగి 1989లో అధికారంలోకి వచ్చింది. అది ఎలా సాధ్యమైంది అన్నది అందరికీ ఆశ్చర్యమైన విషయమే.

ఆ తరువాత అన్నా డీఎంకేకి జయలలిత నాయకత్వం వహిస్తే డీఎంకే 1991లో ప్రతిపక్షంలో ఉంటూ దారుణమైన పరాభవం పొందింది. కేవలం నాలుగు సీట్లు మాత్రమే మొత్తం 232 సీట్లకు గానూ దక్కాయి. ఆ తరువాత 1996లో డీఎంకే గెలిచింది. 2006లో మరోసారి గెలిచింది. అయితే 2011, 2016లలో రెండు సార్లు మళ్ళీ ఓడింది. 2021లో మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచి స్టాలిన్ సీఎం అయ్యారు.

ఇలా డీఎంకే పొలిటికల్ హిస్టరీ అందరికీ స్పూర్తి దాయకమే. అందుకే బీఆర్ఎస్ డీఎంకే వైపు చూస్తోంది. ఆ పార్టీ ఓడి పదమూడేళ్ళు అధికారానికి దూరంగా ఎలా ఉండగలిగింది అన్నది కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ల బృందం అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ లో చెన్నై వెళ్ళి వారం రోజుల పాటు అక్కడ కేటీయార్ బృందం గడుపుతుంది అంటున్నారు.

మరో వైపు చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డీఎంకే పార్టీ నిర్మాణం, స్టేట్ లెవెల్ దాకా ఆ పార్టీ ఏ విధంగా పదవులను పంపిణీ చేస్తుంది, క్యాడర్ తో రిలేషన్స్ ఎలా ఉంటాయి. ఎక్కడెక్కడ పార్టీని ఎలా పటిష్టం చేసుకున్నారు ఇవనీ కేటీఆర్ టీం స్టడీ చేస్తుంది అని అంటున్నారు. ఇక డీఎంకేనే బీఆర్ఎస్ ఎంచుకోవడం వెనక కారణాలు ఉన్నాయట.

డీఎంకే ద్రవిడ వాదంతో పుట్టిన పార్టీ. తెలంగాణా వాదంతో బీఆర్ఎస్ పుట్టిందని రెండు ఫిలాసఫీల మధ్య సారూప్యత ఉందని అందువల్ల ఈ స్టడీ వల్ల బీఆర్ఎస్ కి మంచి విషయాలు లభిస్తాయని దాంతో బీఆర్ఎస్ ని కూడా దశాబ్దాల పాటు చెక్కుచెదర్నీయకుండా చేసుకోవచ్చు అన్నదే గులాబీ పార్టీ పెద్దల ఆలోచన అని చెబుతున్నారు. మొత్తానికి డీఎంకే గురించి మరో రాజకీయ పార్టీ స్టడీ చేయడం అంటే అది ఆ పార్టీ సాధించిన గ్రేట్ అచీఫ్ మెంట్ గానే చూస్తున్నారు.

Tags:    

Similar News