బీయారెస్ జాతీయ పార్టీ కాదా కేసీయార్...?
కేసీయార్ రాజకీయ చాణక్యుడు. మాటల మాంత్రికుడు. ఆయన మైక్ అందుకుంటే ధారాపాతంగా ఉపన్యాసం సాగుతూనే ఉంటుంది.
కేసీయార్ రాజకీయ చాణక్యుడు. మాటల మాంత్రికుడు. ఆయన మైక్ అందుకుంటే ధారాపాతంగా ఉపన్యాసం సాగుతూనే ఉంటుంది. ఆయన తప్పులు తడబాట్లు పెద్దగా చేయరు. అలాంటి కేసీయార్ తాజాగా జరుగుతున్న ఎన్నికల సభలలో మాత్రం తడబడుతున్నారు. ఒకింత తికమకకు గురి అవుతున్నారు.
ఇదంతా ఎందుకు అంటే పోటీ టఫ్ గా ఉంది. అనూహ్యంగా రేసులోకి దూసుకుని వచ్చింది కాంగ్రెస్. విజయావకాశాలు రెండు పార్టీలకూ సరి సమానంగా ఉన్నాయి. దీంతో ఢీ అంటే ఢీ అన్న సన్నివేశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కేసీయార్ నోటి వెంట రాని మాటలు ఇపుడు వస్తున్నాయి.
ఓడిపోతే ఇంట్లో కూర్చుటామని ఆయన ఒక సభలో చెప్పడం కూడా ఆశ్చర్యం కలిగించింది. ఓటమి అన్న మాట ఈవీఎం మిషన్ లో చివరి ఓటుని లెక్కించే దాకా కూడా రాకూడదు అన్నది కేసీయార్ వంటి రాజకీయ చాణక్యుడికి తెలియదా అని అంటున్నారు.
ఇక లేటెస్ట్ గా ఆయన ఖమ్మం జిల్లాలో జరిగిన మీటింగులో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలే దేశాన్ని ఏలాలని ఒక పిలుపు ఇచ్చారు. ప్రాంతీయ పార్టీల వల్లనే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తేనే రాష్ట్రాలలో అభివృద్ధి సాగుతుందని అంటున్నారు.
తెలంగాణాలో జాతీయ పార్టీలకు ఏమిటి పని అని సూటిగా కాంగ్రెస్ బీజేపీని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లో హై కమాండ్ ఉంటుందని అక్కడ వారి వద్ద చేతులు కట్టుకునే బానిసలా తెలంగాణ వంటి చైతన్యవంతమైన నేలను పాలించడానికి కావాలా అని ఆయన నిలదీశారు. మొత్తానికి కేసీయార్ కాంగ్రెస్ బీజేపీలని విమర్సించే క్రమంలో తనది జాతీయ పార్టీ అన్న సంగతిని విస్మరించారు అని అంటున్నారు.
సరిగ్గా ఏడాది క్రితమే టీయారెస్ ని బీయారెస్ గా మార్చి నామకరణం బారసాల చేసిన కేసీయార్ దేశమంతా తిరిగి వచ్చారు. దేశ రాజకీయాలలో బీయారెస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని కూడా అన్నారు. మరి ఇన్ని రకాలుగా బీయారెస్ ని ముందుకు తెస్తున్న కేసీయార్ ఇపుడు తనది ప్రాంతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారా అన్నదే పెద్ద చర్చ. ఒకింత విస్మయం కూడా కలిగిస్తోంది.
జాతీయ రాజకీయాలలో వెలగాలని ఉబలాటపడిన కేసీయార్ కి ఇపుడు ముందు తెలంగాణాలో గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అందుకే ఆయన నేరుగా అనకపోయినా బీయారెస్ వారు చంద్రబాబుని పవన్ కళ్యాణ్, షర్మిలను పట్టుకుని ఆంధ్రా వారు తెలంగాణా రాజకీయాల్లో వేలు పెడుతున్నారని అంటున్నారు.
ఎన్నికల ప్రచారం పీక్స్ కి వెళ్తే కేసీయార్ కేటీయార్ కూడా అదే మాట అనవచ్చు. అలా కనుక అంటే అపుడు బీయారెస్ అన్న పేరుకు జాతీయ పార్టీ అని చెప్పుకోవడానికి అర్ధం ఏమి ఉంటుందని అంటున్నారు. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ కాదని కేవలం తొమ్మిదిన్నరేళ్ళ బీయారెస్ పనితనం మీదనే జరిగే ఎన్నికలు ఇవి అని తెలిసినా బీయారెస్ నేతలు మళ్ళీ అదే సెంటిమెంట్ ని రగిలిస్తున్నారు అని అంటున్నారు.
అంతే కాదు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అని కొత్త లెక్కలతో కేసీయార్ కాంగ్రెస్ బీజేపీలని ఎడం పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇవన్నీ జనాలకు అవసరం ఉంటాయా అన్నదే ప్రశ్న. వారికి ఎవరు తమను బాగా పాలిస్తారు అని నమ్ముతారో వారికే ఓటు వేస్తారు. ఇక కాంగ్రెస్ మీద ఆదరణ ఉంటే గెలుస్తుంది. లేదా బీయారెస్ పెర్ఫార్మెన్స్ నచ్చితే ఆ పార్టీని గెలిపించుకుంటారు.
ఈ నేపధ్యంలో చూసుకుంటే కేసీయార్ అనవరసంగా తన పార్టీని జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి తగ్గించుకుంటే రేపటి రోజున లోక్ సభ ఎన్నికలపుడు ఇతర రాష్ట్రాలలో రాజకీయం ఎలా చేస్తారు అన్న ప్రశ్నలు అయితే పుట్టుకుని వస్తున్నాయి. మరి కేసీయార్ ఎందుకు ఇలా మాట్లాడారు అన్న చర్చ అయితే సాగుతోంది.