మైనంప‌ల్లి క‌ల నెర‌వేరే చాన్స్ లేదా... కాంగ్రెస్ షాక్ రెడీ!

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఎపిసోడ్ ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

Update: 2023-09-24 03:52 GMT

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఎపిసోడ్ ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ పెద్ద‌ల‌పై విమ‌ర్శ‌లు చేసి , అనంత‌రం అదే దూకుడును కొన‌సాగించిన మైనంప‌ల్లి ఎట్ట‌కేల‌కు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయ‌న అడుగులు కాంగ్రెస్ వైపేన‌ని ఖ‌రారు అయిన నేప‌థ్యంలో కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సందడి వాతావరణ నెలకొంది. మైనంపల్లి నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యర్తలు భారీగా చేరుకుని హ‌డావుడి చేసేశారు. అయితే, మైనంప‌ల్లి ఏ కార‌ణం వ‌ల్ల అయితే బీఆర్ఎస్ పార్టీకి బైబై చెప్పేశారో... అదే స‌మ‌స్య కాంగ్రెస్ పార్టీలోనూ ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అభినందిస్తూ... కుత్బుల్లాపూర్,మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకోని అభినంద‌న‌లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీలాంటి సీనియ‌ర్ల సేవ‌లు చాలా అవసరమని, పార్టీ త‌ర‌ఫున తాము పూర్తిగా కృషి చేసి గెలుపు కోసం శ్ర‌మిస్తామ‌ని హామీలు ఇచ్చారు. కార్య‌క‌ర్త‌ల అండ‌తోనే, వారి కోస‌మే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా మైనంప‌ల్లి ప్ర‌క‌టించారు. అయితే, మైనంపల్లి ఫ్యామిలీ టికెట్స్ డిమాండ్‌పై కాంగ్రెస్‌లో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తండ్రి హనుమంతరావు, కొడుకు రోహిత్‌లకు రెండు టికెట్లు ఇవ్వలేని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని అంటున్నారు.

రాజ‌స్తాన్ ఉదయపూర్‌లో గ‌తంలో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో కనీసం ఐదేళ్లు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన వారికే రెండో టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించుకుంది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ప్రస్తావిస్తున్న పార్టీ నేతలు కుటుంబానికి ఒక్కటే టికెట్‌ అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్‌ తీర్మానం మైనంప‌ల్లి క‌ల‌కు అడ్డంకిగా మారే ప్ర‌మాదం ఉంద‌ని చెప్తున్నారు. కండువా క‌ప్పుకొనే స‌మ‌యంలో హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ త‌దుప‌రి ద‌శ‌లో ఆయ‌న‌కు నిరాశ త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే, మైనంప‌ల్లి వ‌ర్గీయులు మాత్రం ఆశావ‌హంగా ఉన్నారు. గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆర్థిక, అంగబలం కలిగిన నేతలను రంగంలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది కాబ‌ట్టి మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, ఆయ‌న త‌న‌యుడికి టికెట్ ఖాయ‌మంటున్నారు. ఈ మేరకు అధిష్టానం సూచనలను, సలహాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాతే మైనంప‌ల్లి త‌న తదుప‌రి వేదిక‌గా హ‌స్తం పార్టీని ఎంపిక చేసుకున్న‌ట్లు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఉత్కంఠ‌కు మ‌రికొద్దిరోజుల్లో తెర‌ప‌డ‌నుంది.

Tags:    

Similar News