కాంగ్రెస్ కు రాజ్య సభ సీటివ్వనున్న బీఆర్ఎస్!

64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు పలుకుతుంది. బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు.

Update: 2023-12-27 06:32 GMT

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి.. మరో ఐదు నెలల్లో లోక్ సభ ఎన్నికలూ రానున్నాయి.. వీటి మధ్యలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లో మూడు రాజ్య సభ సీట్లు ఖాళీ కానున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ బంధువైన జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. వీటికి ఎన్నికలను మార్చిలోనే నిర్వహించనున్నారు.

39.6 మంది ఎమ్మెల్యేలకు ఒకరు

తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికలో వీరంతా ఓటింగులో పాల్గొంటారు. ప్రతి 39.6 సభ్యులకొకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. ప్రస్తుతం ఈ పూర్తి కోటాతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు గానీ, మూడు గానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. రాజ్యసభ బరిలో అభ్యర్థిని దింపడానికి 10 మంది శాసనసభ్యులు ప్రతిపాదించాలి. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కు మాత్రమే అసెంబ్లీలో పదిమందిపైగా ఎమ్మెల్యేలున్నారు. ఇక ఈ రెండింటికి కూడా మిత్రపక్షాలతో కలిపి ఒక సీటుకు సరిపడా మాత్రమే ఓట్లున్నాయి. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కు సీపీఐ మద్దతు పలుకుతుంది. బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు.

ఒకటి పక్కా.. రెండోది పోటీ..

ఓట్ల ప్రకారం.. కాంగ్రెస్‌ ఒక సీటును గెలుచుకుంటుంది. సీపీఐతో కలిపి 25 ఓట్లు మిగులుతాయి. రెండో అభ్యర్థి గెలుపునకు 15 సీట్లు తక్కువ పడతాయి. బీఆర్ ఎస్ కు ఒక అభ్యర్థి గెలుపునకు అవసరమైన 39.6 ఓట్లు లేవు. అయితే, 39 ఓట్లున్నందున మిత్రపక్షమైన మజ్లిస్‌ మద్దతుగా నిలిస్తే 46 ఓట్లు అవుతాయి. ఒక సీటు గెలిచాన ఆరు ఓట్లు మిగిలినా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. అయితే, మూడు స్థానాలకు ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే.. పోలింగ్, సంఖ్యా బలంతో సంబంధం లేకుండా ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే.. మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే 25 ఓట్లు ఎక్కువ ఉన్నందున కాంగ్రెస్ రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్, మజ్లిస్ కు ఒకటి గెలవగా.. ఆరు ఓట్లే ఉంటాయి. పదిమంది ప్రతిపాదన నిబంధనకు తగిన బలం లేదు. దీంతో రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఈ లెక్కన కాంగ్రెస్‌ రెండు, బీఆర్ఎస్ ఒక సీటు దక్కించుకుంటాయి. అయితే, ఇలా కాదని కాంగ్రెస్ మూడు, బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేస్తే పరిస్థితి ఉత్కంఠగా మారుతుంది. కాంగ్రెస్‌ కు ముగ్గురు అభ్యర్థులు ఉంటే ఒక్కొక్కరి ఓట్ల బలం 21.6 అవుతుంది. కాంగ్రెస్‌ ఇలా చేస్తే బీఆర్ఎస్, మజ్లిస్‌ కలిసి పోటీ చేస్తుంది. అప్పుడు వాటి బలం 46 అవుతుంది. అంటే దానికి రెండు స్థానాల్లో 23 చొప్పున ఓట్లు ఉంటాయి. అది కాంగ్రెస్‌ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ. కాబట్టి రెండు పార్టీలు తమ బలానికి తగ్గట్లు అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది.

Tags:    

Similar News