పాఠశాలల్లో బుర్ఖా నిషేధం... తెరపైకి కొత్త రగడ!

అవును... ఫ్రాన్స్ లోని పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-08-28 13:42 GMT

మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థినులు బుర్ఖాలు ధరించడంపై వివాదాలు రగులుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ బుర్ఖా వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అనంతరం జరిగిన ఎన్నికల ఫలితాల సంగతి అలా ఉంచితే... ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ లో ఇలాంటి రగడే సాగుతోంది.

అవును... ఫ్రాన్స్ లోని పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ కీలక ప్రకటన చేశారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని అన్నారు.

ఈ సందర్భంగా... బుర్ఖాలు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయని.. దీనివల్ల ఫ్రాన్స్‌ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతోందని గాబ్రియేల్ పేర్కొన్నారు. దీంతో... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అన్ని పాఠశాలల్లోనూ అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇదే క్రమంలో... ఈ నిషేధాజ్ఞలకు సంబంధించిన విషయాలను, విధివిధానాలను స్కూళ్ల ఉన్నతాధికారులకు తెలియజేస్తామని గాబ్రియేల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లౌకికవాదం పాఠశాల దశలోనే నేర్చుకోవాల్సిన అంశం అన్ని అన్నారు.

ఇందులో భాగంగా... తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతోనే ఫలానావారి మతం ఏంటో చెప్పేల ఉండకూడదని చెప్పిన ఆయన... 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే దుస్తులను ధరించకూడదన్న విషయాన్ని గుర్తు చేశారు.

తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాఠశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో బుర్ఖా ధరించే సాంప్రదాయం పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలను ఆహ్వానిస్తున్నాయి.

కాగా... పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖాలను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్‌ లో కొద్దిరోజులుగా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News