కెనడాలో కలకలం: మనోళ్లకు తిప్పలు ఏం జరిగింది?
ఉన్నత విద్య కోసం భారత్ నుంచి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు కెనడాకు వెళ్తున్నారు. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు ఫీజులు కూడా అందుబాటులో ఉండడం ప్రధాన కారణం.
కెనడాలో కలకలం రేగింది. భారత విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తమ పరిస్థితి దారుణంగా తయారైందని.. భారత ప్రభుత్వం పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. దీంతో వీరి ఆందోళన ఇప్పుడు భారత్ వరకు చేరింది. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు కెనడాకు వెళ్తున్నారు. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు ఫీజులు కూడా అందుబాటులో ఉండడం ప్రధాన కారణం. అయితే.. ఇలా విదేశాల నుంచి వస్తున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో కెనడాలోని పలు రాష్ట్రాల్లో విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామమనే భారత విద్యార్థులకు సంకటంగా మారింది.
ఏం జరిగింది?
కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రాష్ట్రం తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. పైగా.. వెంటనే ఉపాధి కూడా దొరుకుతుంది. దీంతో విదేశాల నుంచి వెళ్తున్న వారు.. ఈ రాష్ట్రానికి ఎక్కువగా వస్తున్నారు. దీంతో స్థానికులు తమకు ఉద్యోగాలు, ఉపాధి దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం నూతనంగా కొన్ని చట్టాలు తీసుకువచ్చింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కూడా మార్చింది. స్థానికంగా చదివే విదేశీ విద్యార్థులు శాశ్వత నివాసం కావాలని అనుకుంటే.. భవన నిర్మాణ రంగంలో పనిచేయాలని.. లేదా.. పిల్లను సాకే స్కూళ్లలో పనిచేయాలని, స్థానిక వైద్య శాలల్లో రోగులకు సేవలు అందించాలని పేర్కొంది.
అయితే.. ఈ పనులు చేయాలంటే.. సమయం ఎక్కువగా వెచ్చించాల్సి రావడం.. వచ్చే ఆదాయం తక్కువగా ఉండడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామంతోనే చైనా సహా ఇతర దేశాల వారు.. ఈ రాష్ట్రాన్నివదిలేశారు. అయితే.. భారత విద్యార్థులు మాత్రం ఇక్కడి చట్టాలు మార్చాలని.. తాము రిటైల్, సేవల రంగాల్లో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. దీంతో గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై భారత ప్రభుత్వం పట్టించుకోవాలని కూడా కోరుతున్నారు. మరి భారత్ ఏం చేస్తుందో చూడాలి. అయితే.. ఇక్కడ ఒక డౌట్ రావొచ్చు. మన వాళ్లు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి చదువుకోవచ్చు కదా! అని. కానీ, ఇక్కడ ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా వంటి ప్రఖ్యాత సంస్థలు వున్నాయి. వీటిలో చదివితే వెంటనే పెద్ద జీతంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే మనవాళ్లు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.