చంద్రబాబుకు ముద్దుతో సర్ ప్రైజ్ షాకిచ్చిన మహిళ
పరవాడలో పర్యటించిన సందర్భంగా సభావేదిక నుంచి కాన్వాయ్ బస్ ఎక్కేందుకు నడుచుకుంటూ వెళుతున్న చంద్రబాబుకు ఒక మహిళ పుష్పగుచ్చం అందించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న క్రేజ్ ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఆయన.. తన తీరుకు భిన్నంగా ఎమోషనల్ గా ఉంటున్నారు. అందరి మనసుల్ని గెలుచుకుంటున్నారు. గతానికి.. వర్తమానానికి బాబులో వచ్చిన వ్యత్యాసం.. అణుకువను మరింత పెంచటమే. గతంలో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సీఈవో మాత్రమే అన్నట్లు వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు మనసుల్ని గెలుచుకునే ముఖ్యమంత్రి పాత్రను పోషించేందుకు ఇష్టపడుతున్నారు.
జైలు జీవితం ఆయనలో తీసుకొచ్చిన మార్పుల్లో ఒకటిగా చెప్పొచ్చు. పేదల ఇళ్లకు వెళ్లినప్పుడు ఫోటోలకు ఫోజులకే పరిమితమయ్యే నాటి చంద్రబాబుకు భిన్నంగా.. వారింట్లో టీ కలుపుతూ.. తోటి మంత్రులతో ముచ్చట్లు చెబుతూ.. వారితో సరదాగా మాట్లాడే తీరు చంద్రబాబులో రావటం ఆయన ఎంత మారారు? అన్న దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా అనకాపల్లిజిల్లాలో పర్యటించిన ఆయనకు ఊహించని అనుభవం ఒకటి ఎదురైంది.
పరవాడలో పర్యటించిన సందర్భంగా సభావేదిక నుంచి కాన్వాయ్ బస్ ఎక్కేందుకు నడుచుకుంటూ వెళుతున్న చంద్రబాబుకు ఒక మహిళ పుష్పగుచ్చం అందించారు. సాధారణంగా అంత దగ్గరగా భద్రతా సిబ్బంది అనుమతించరు. అయితే.. ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ.. భద్రతా సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ దగ్గరకు రావటం.. బొకే ఇవ్వటం చేశారు. అనంతరం చంద్రబాబును ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ పలుమార్లు చంద్రబాబుకు ముద్దు పెట్టే ప్రయత్నం చేయటం.. భద్రతా సిబ్బంది ఆమెను పక్కన పెట్టే ప్రయత్నం చేయటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు మహిళ చేసిన చేష్ట అందరిని సర్ ప్రైజ్ చేసింది.