జమిలి ఎన్నికలకు జై... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

చాలామంది ఊహించినట్లుగానే.. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో జమిలీ ఎన్నికల చర్చ మొదలైంది.

Update: 2024-10-09 14:07 GMT

చాలామంది ఊహించినట్లుగానే.. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో జమిలీ ఎన్నికల చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి తాజా మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉండాలన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల చర్చ తెరపైకి బలంగా వస్తోందని తెలుస్తోంది. ఈ సమయంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలపై స్పందించారు. ఇందులో భాగంగా జమిలి ఎన్నికలకు దేశమంతా సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇదే క్రమంలో.. దేశంలో సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని.. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎనికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని.. పార్లమెంట్, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుటుందని.. ఆ విధంగా అన్నింటికీ ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై దృష్టిసారించొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు... సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు గనుకే హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. బీజేపీ అగ్రనాయకత్వం పనితీరు వల్లే అక్కడ హ్యాట్రిక్ విజయం సాధ్యమైందని అన్నారు!

ఈ విధంగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఎన్డీయే కూటమికి శుభసూచమని చెప్పిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకం ఉంచిన ప్రజలు ఓటేశారని అన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయే కు మంచి ఫలితాలు వస్తాయని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా చర్చ మొదలైనట్లు చెబుతున్న జమిలీ ఎన్నికలపై బాబు మనసులో మాట చెప్పడంతో... త్వరలో ఆ దిశగా కేంద్రప్రభుత్వం ముందుకు సాగే అవకాశాలున్నాయని.. రెండేళ్లలోనే జమిలీ ఎన్నికలకు ముహూర్తం పెట్టినా ఆశ్చరపోనక్కరలేదని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News