డిప్యూటీ సీఎం ఇంట్లో.. డిప్యూటీ సీఎంలు లేకుండానే తెలుగు సీఎంల తొలి భేటీ?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తొలిసారి భేటీ అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తొలిసారి భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 6వ తేదీన సమయం నిర్దేశించారు. అయితే, ఆ రోజు నుంచే ఆషాఢ మాసం ప్రారంభం అవుతోంది. దీంతో తొలి భేటీకి ముహూర్తం చూసుకున్నారా లేదా? అనే ప్రశ్నలూ సంప్రదాయాలను పాటించే వారి నుంచి వస్తున్నాయి. మరిప్పుడు సీఎంల భేటీ వేదిక ఎక్కడా? అని పరిశీలిస్తున్నారు. సమావేశం జరిగేది ‘ప్రజా భవన్’ అని తెలిసి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.
జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో ముచ్చటపడి ఏడు ఎకరాల్లో ప్రగతి భవన్ కట్టించారు. అందులోనూ దాదాపు ఏడెనిమిదేళ్లు ఉన్నారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో సీఎంగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి ఉన్న భవనాన్ని అలాగే ఉంచి.. మరొక పెద్ద భవనం కట్టించుకున్నారు కేసీఆర్. గత ఏడాది డిసెంబరు 3న ఎన్నికల ఫలితాల అనంతరం సాయంత్రానికే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభువం ప్రగతి భవన్ ముందున్న ఇనుప గేట్లను తీయించి, మహాత్మ జ్యోతి బా పూలే ప్రజా భవన్ గా పేరుమార్చింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా దీనిని కేటాయించింది. ఇదే భవన సముదాయంలో పలువురు మంత్రులు కూడా ఉంటున్నారు. ప్రధానమైన భవనంలో మాత్రం భట్టి నివాసం కమ్ కార్యాలయం కొనసాగుతోంది.
సీఎంల భేటీ ఇక్కడే
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. ప్రజా భవన్ లో కాకుండా జూబ్లీహిల్స్ లోని ఇంటినే అధికారిక నివాసం చేసుకున్నారు. మధ్యలో ఎంసీహెచ్ ఆర్డీని క్యాంపు కార్యాలయంగా వాడుకుంటారన్న కథనాలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి, మరికొందరు మంత్రులు ఉంటున్న ప్రజా భవన్ ను రేవంత్, చంద్రబాబు భేటీకి వేదిక చేసుకున్నారు. మరి తన నివాసం (క్యాంపు కార్యాలయం)లో జరుగుతున్న సీఎంల సమావేశంలో భట్టికి అవకాశం ఉంటుందా?
పవన్ కల్యాణ్ కూడా వస్తారా?
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి పాల్గొనడం సరే.. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారా? అనేది ఆసక్తికరం కానుంది. కేవలం సీఎంల భేటీనే అయినా.. జరుగుతున్నది భట్టి నివాసంలో. మరి ఆయన లేకుండానే ఎలా? ఒకవేళ భట్టి పాల్గొంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉండాలి కదా? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పవన్ కల్యాణ్ హోదాకు తగిన గౌరవం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చ మొదలైంది.