జగన్ మళ్లీ సీఎం....బాబు మాస్టర్ ప్లాన్ ఏంటి ?

రాజకీయాలను విశ్లేషించిన వారికి కూడా ఏమి జరుగుతుంది అన్నది అసలు తెలియదు.

Update: 2024-07-07 17:51 GMT

ఏపీకి మళ్లీ జగన్ సీఎం అవగలరా. ఆయన ఒక్క చాన్స్ అన్నది అలా వచ్చి వెళ్లిపోయినట్లేనా. టీడీపీ నేతలు గత అయిదేళ్ళుగా ఒకటికి పదిసార్లు ప్రచారం చేసినట్లుగా జగన్ ఒక్కసారికి మాత్రమే సీఎం గా చరిత్రలో నిలిచిపోతారా ఇవన్నీ ప్రశ్నలు. జవాబులు అయితే ఎవరికీ తెలియవు.

రాజకీయాలను విశ్లేషించిన వారికి కూడా ఏమి జరుగుతుంది అన్నది అసలు తెలియదు. ప్రజల మూడ్ అన్నది ఎపుడూ పట్టుకోలేని అతి పెద్ద బ్రహ్మ పదార్ధంగా ఉంది. దాంతో 2029 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారా అంటే ఈ చాన్స్ మిస్ కానీ నెక్స్ట్ చాన్స్ మాదే అని వైసీపీ నేతలు అంటారు.

ఓడిన పార్టీలో ఆ రకమైన నమ్మకం ఉండాల్సిందే. అందునా అధికారం ఒకసారి అనుభవించి విపక్షంలోకి వచ్చిన పార్టీ మళ్లీ గద్దెనెక్కేందుకు దారులు చూసుకుంటుంది. అలా వైసీపీ తన ప్రయత్నం తాను ఈ అయిదేళ్ళలో చేస్తుంది. అది సహజాతి సహజం కూడా.

అయితే విపక్షం అధికారంలోకి రావాలంటే దాని కష్టంతో పాటు అధికర పక్షం కూడా తప్పులు చేస్తూ పోవాలి కదా. అలా చాన్స్ ఇవ్వాలి కదా. న్యూట్రల్ ఓటింగ్ పది శాతం ఇటు నుంచి అటు తిరిగితేనే అధికారం అని 2014 నుంచి జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి.

మరి ఆ విధంగా భారీ ఎత్తున యాంటీ ఇంకెబెన్సీని మూటకట్టుకోవడంతోనే వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయి టీడీపీకి బంగారు పళ్ళెంలో అధికారాన్ని అప్పగించింది. కానీ టీడీపీ అలా చేస్తుందా అన్నదే చర్చ. టీడీపీకి వరసబెట్టి గెలిచిన చరిత్ర గతంలో ఉంది.

టీడీపీ పుట్టిన తరువాత 1983, 1985లలో వరసగా గెలిచింది. తిరిగి 1994, 1999లలో గెలిచింది. అయితే 2014లో మాత్రం ఆ వరస తప్పింది. అప్పట్లో వైసీపీని తక్కువ అంచనా వేశామని స్వయంగా చంద్రబాబు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇటీవలే చెప్పారు. దాంతో ఈసారి వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా పాలించాలనే అనుకుంటున్నారు.

రెండు సార్లు గెలుపు మధ్యలో ఒకసారి ఓటమి ఇదీ విభజన ఏపీలో టీడీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు. దాంతో వైసీపీకి ఏపీ ప్రజల మూడ్ ఏంటి వారి ఆలోచనలు ఏంటి తాము చేయాల్సినంది ఏంటి అన్న దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. అదే టైం లో బాబుని పాలనా దక్షుడిగా జనం ఎపుడూ అంగీకరిస్తారు. దాంతో పాటు సంక్షేమం కూడా జత కూడితే బాబుకు తిరుగే లేదు అని అంటున్నారు.

అంతే కాదు ఏపీలోని అన్ని సామాజిక వర్గాలు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టాయి. ఆ అభిమానం అలా ఉంచుకుంటూ రానున్న అయిదేళ్లలో పాలన సాగితే వైసీపీకి మళ్లీ అధికారం అన్న ప్రసక్తే ఉండదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన టీ టీడీపీ మీటింగులో చంద్రబాబు వైసీపీకి అధికారం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అన్న దాని మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ ప్రశ్న తనకు చాలా చోట్ల ఎదురైంది అని అంటూ తాజా ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడించి ఉనికి లేకుండా చేశామని ఇక ఆ రాజకీయ భూతాన్ని రానున్న కాలంలో అసలు ఎక్కడా కనిపించకుండా భూస్థాపితం చేస్తామని అన్నారు.

అంటే వైసీపీ అన్న మాట ఏపీలో వినిపించకుండా చేయడానికి టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది అని అర్ధం అవుతోంది. టీడీపీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యంతో ఉంది. ఎన్నడూ లేని విధంగా అన్ని వైపుల నుంచి మద్దతుతో బాబు బలంగా ఉన్నారు. పైగా ఆయన రాజకీయ అనుభవం వ్యూహాలు అన్నీ కనుక లెక్క వేసుకుంటే ఆయన తలచుకుంటే వైసీపీని టార్గెట్ చేసి రాజకీయంగా దెబ్బ తీయడం కష్టం కాదని అంటున్నారు.

దానికి తోడు వైసీపీ సంస్థాగతంగా అనుకున్నంత బలంగా లేకపోవడం జగన్ వన్ మాన్ ఆర్మీగా పార్టీని నడపడం, ఒంటెద్దు పోకడలు బలమైన సొంత సామాజిక వర్గం దూరం కావడం, పోటీలో కాంగ్రెస్ నిలిచి ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ కి గండి కొట్టేలా జోరు చేయడం వంటివి చూసుకుంటే కనుక వైసీపీకి 2029 ఎన్నికలు అంత ఈజీగా కావు అని అంటున్నారు.

ఒక విధంగా లైఫ్ అండ్ డెత్ గా మారుతాయి. ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలవకపోతే బాబు చెప్పినట్లుగానే జరగవచ్చు అన్నది ఒక విశ్లేషణ. ఏది ఏమైనా ఇపుడు ఈ విధంగా ఒక అంచనాకు రావడం కాస్తా తొందర అయినా ఈ రోజు పరిస్థితులు చూస్తే టీడీపీ కంచు కోటగా ఉంది. వైసీపీ మంచుకోట కరుగుతోంది. సో వైసీపీ అలెర్ట్ గా ఉండాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News