టీడీపీ వర్సెస్ వైసీపీ : శ్వేత పత్రాలు చెప్పే సత్యాలు !
అలాగే మంచి చేసినది ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం చెప్పదు కానీ చెడు చేస్తే ఏకి పారేస్తుంది.
ఏ ప్రభుత్వంలోనైనా మంచి చెడూ రెండూ ఉంటాయి. చెడు ఎక్కువైతే చెడ్డ ప్రభుత్వం అంటారు. అలాగే మంచి చేసినది ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం చెప్పదు కానీ చెడు చేస్తే ఏకి పారేస్తుంది. అదే విధంగా చెడు చేసిన గత ప్రభుత్వం ఒప్పుకోదు, అంతా మంచే చేశామని అంటుంది.
ఇది రాజకీయ రచ్చగానే సాగుతూ ఉంటుంది. ఎవరు ఏమి చేశారు అన్నది ప్రజలు గమనించే అయిదేళ్ళకు ఒక మారు ప్రజలు మార్కుల రూపంలో తీర్పుని వెలువరిస్తారు. దాంతో ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే ఏ ఏ అంశాలలో తప్పులు జరిగాయని ప్రజల తీర్పులో ఎక్కడా ఉండదు, అంటే ఫలానా సబ్జెక్ట్ లో మార్కులు ఇన్ని అని వేయరు.
ఆ పని అయితే కొత్త ప్రభుత్వం చేస్తుంది. మీరు అన్ని రంగాలలో విఫలం అయ్యారని అంటూనే ప్రతీ రంగంలోనూ సాధికారంగా గణాంకాలను తెచ్చి మీడియా ముఖంగా పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలు ఇవీ అని చెబుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంస్కరణలు అని చెప్పాలో మరేమి అనాలో తెలియదు కానీ విద్యుత్ ఛార్జీలు అయితే ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.
విద్యుత్ సంస్థలకు చార్జీలను పెంచుకునే విధంగా ఎప్పటికపుడు వెసులుబాటు కల్పించారని ట్రూ అప్ చార్జీల పేరుతో కొత్త రకంగా బాదుడు బాదేసారు అని కూడా అంతా బాధపడ్డారు. ఒక్కసారిగా బిల్లులు వందల నుంచి వేలకు పెరిగాయి. సామాన్యుడు అయితే తట్టుకోలేని పరిషితి అని కూడా విమర్శలు వచ్చాయి. వైసీపీ ఓటమికి ఇదొక ప్రధాన కారణం అని కూడా అన్నారు.
ఇక విద్యుత్ ఉత్పత్తి సరిపోక చేసిన కొనుగోళ్లలో అవినీతి జరిగిందని టీడీపీ సహా విపక్షాలు నాడు ఆరోపించాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విద్యుత్ శాఖ పరంగా గత అయిదేళ్లలో జరిగిందేమిటి అన్నది కొత్త ప్రభుత్వం కచ్చితంగా పరిశీలిస్తుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఈ కీలకమైన శాఖ మీద ఏకంగా శ్వేతపత్రం రిలీజ్ చేసింది.
ఈ శ్వేత పత్రంలో అయితే చాలా విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ప్రజలకు, విద్యుత్ రంగంలో రూ.1,29,503 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్త పేర్లతో వడ్డించిన ఛార్జీలతో రూ.32,166 కోట్ల భారాన్ని మోపి ప్రజల నడ్డి విరిచారని అన్నారు.
అదే విధంగా 2019-24లో మధ్య ఉన్న ప్రభుత్వం అప్పులు కూడా రూ.1,29,503 కోట్లు తెచ్చారు. వీటీపీఎస్ 55 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ. 2,029 కోట్లు, కృష్ణపట్నంను కూడా 44 నెలలు ఆలస్యం చేయడం వల్ల రూ.2,035 కోట్లు అదనంగా ఖర్చు అవుతోంది. రూ.3,800 కోట్లతో 17 వేల మెగా యూనిట్లు కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.12,816 కోట్లు అదనపు భారం పడిందని బాబు చెప్పుకొచ్చారు.
అయితే దీని మీద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే బాబుని పూర్తిగా తప్పు పట్టారు. కేవలం జగన్ మీద విమర్శలు చేయాలనే ఈ శ్వేతపత్రాలతో బాబు మభ్యపెడుతున్నారని ఆయన అంటున్నారు. నిజానికి చూస్తే అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో డిస్కంలు కుప్పకూలాయని తెలిపారు. సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయిన స్థితిలో కూడా యూనిట్ కు రూ.7 చెల్లించేలా ఒప్పందం గతంలో చంద్రబాబు చేసుకున్నారని ఆరోపించారు. ట్రూ అప్ చార్జీలకు ఆద్యుడు చంద్రబాబేనని విమర్శించారు.
చంద్రబాబు పదవి నుంచి తప్పుకునే నాటికి విద్యుత్ రంగంలో ఉన్న అప్పు రూ.86,215 కోట్లు అని కూడా మంత్రి అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలన చూస్తే వృద్ధి రేటు 1.9 శాతం మాత్రమేనని అదే జగన్ పాలనలో విద్యుత్ రంగంలో వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైందని కాకాణి వెల్లడించారు. జాతీయ సగటు కంటే ఇదే అధికమని కానీ చంద్రబాబు ఇవేవీ చెప్పకుండా పూర్తిగా జగన్ ను విమర్శించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
మొత్తానికి చూస్తే మొన్న అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ దాన్ని తప్పుపట్టారు. బాబు చెప్పేవి అన్ని అబద్ధాలు అన్నారు. దాని కంటే ముందు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అంబటి రాంబాబు అన్నీ పచ్చి అసత్యాలు అని విమర్శించారు. మరి శ్వేతపత్రాలలో సత్యాలు ఏమిటి వాటి వెనక ఉన్న రాజకీయం ఏమిటి అన్నది సగటు జనాలకు అయితే అర్థం కానిదే.
అయితే ఒక్క మాట మాత్రం నిజం. గత ప్రభుత్వం తప్పులు చేయడం వల్లనే దిగిపోయింది. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. చీకటిని తిడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. అంతే కాదు నిజాలు ఎవరూ ఒప్పుకోరు. అది అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా. ప్రజలకు అంతిమంగా కావాల్సింది తమ ప్రయోజనాలు మాత్రమే.