నేనూ పవనూ...ఎన్టీయార్ ఎక్కడ...!?

ఈ సభలలో చంద్రబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తలచుకున్నారు. మాటకు వస్తే చాలు నేనూ పవన్ అని చెప్పడం ఒకింత ఆసక్తిని కలిగించింది.

Update: 2024-03-02 20:11 GMT

రాజకీయం అంటే ఇదేనేమో. ఏ రోటికాడ ఆ పాట పాడేవారే రాజకీయంగా రాణిస్తారు. ఈ విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫార్టీ ఇయర్స్ అనుభవం. ఆయన ఎప్పటికి ఏది అవసరమో దానినే ప్రస్తావిస్తారు. దాని మీదనే దృష్టి పెడతారు. 2019 ఎన్నికల వరకూ బాబు ఎన్నికల ప్రసంగాలు ఒక ఎత్తు. 2024 ఎన్నికల ప్రసంగాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఉన్నాయి.

చంద్రబాబు పవన్ కలసి ఇప్పటిదాకా రెండు సభలలో పాలుపంచుకున్నారు. ఒకటి విజయనగరం జిల్లాలో జరిగిన నారా లోకేష్ యువగళం ముగింపు సభ. ఆ సభలో తొలిసారి పవన్ చంద్రబాబు వేదిక మీద కనిపించారు. దాని తరువాత పొత్తులు కుదిరి తొలి విడత జాబితా రిలీజ్ చేసిన తరువాత తాడేపల్లిగూడెం లో జెండా పేరుతో నిర్వహించిన సభలో మరోమారు ఇద్దరు నాయకులు వేదిక మీద చేతులు కలిపారు.

చంద్రబాబు ఈ రెండు సభలకు ముందూ తరువాత కూడా జనంలోనే ఉంటున్నారు. తిరుగుతున్నారు. రా కదలిరా అంటున్నారు. మధ్యలో బహిరంగ సభలు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. అలా చంద్రబాబు నెల్లూరులో జరిగిన సభలో వైసీపీ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో పాటు మరికొందరిని పార్టీలో చేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన పల్నాడు జిల్లా దాచేపల్లిలో రా కదలిరా సభను నిర్వహించారు.

ఈ సభలలో చంద్రబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తలచుకున్నారు. మాటకు వస్తే చాలు నేనూ పవన్ అని చెప్పడం ఒకింత ఆసక్తిని కలిగించింది. నిజానికి పవన్ పరోక్షంలో కూడా ఆయన పేరు తలచుకుంటూ చంద్రబాబు జనసైనికులను తమతో ఉండేట్టు చేసుకుంటున్నారు.

వైసీపీ బాధితులం నేనూ పవన్ అని బాబు అంటున్నారు. వైసీపీ వారు పవన్ మూడు పెళ్ళిళ్ల గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడితే ఆయన ఆఖరుకు జగన్ నా నాలుగవ పెళ్లాం అని అనాల్సి వచ్చిందని చంద్రబాబు సెటైర్లు వేసారు. ఈ దెబ్బకు ఏమి మాట్లాడాలో వైసీపీ నేతలకు అర్ధం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు.

అలాగే మరో సందర్భంలో కూడా ఏపీ కోసం తాను పవన్ కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇలా వీలు అయిన చోట్ల వీలు అయిన సందర్భాలలో ఇటీవల కాలంలో తరచుగా పవన్ ప్రస్తావన తో చంద్రబాబు తన సభలలో సందడి చేస్తున్నారు. గతంలో అయితే ప్రతీ మాటకు మన నాయకుడు ఎన్టీయార్ అని చెబుతూ ఉండేవారు. కానీ ఎందుకో ఇపుడు ఎన్టీయార్ గురించి తగ్గించి మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు అయితే ఎన్టీయార్ ఊసే ఉండడం లేదు.

గతంలో ఎన్టీయార్ స్పూర్తితో ప్రతీ ఒక్కరూ బొబ్బిలి పులిలా సర్దార్ పాపారాయుడుగా తిరగబడాలని బాబు పిలుపు ఇచ్చేవారు. ఇపుడు పవన్ ఉదాహరణలే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ అలా అన్నారు ఇలా విమర్శించారు అని తన సభలలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చెబుతూండడం చూసిన వారు బాబు అంతా వ్యూహం ప్రకారమే చేస్తున్నారు అని అంటున్నారు.

పవన్ చంద్రబాబుతో ప్రతీ సభలో పాలుపంచుకోవడంలేదు. ఆ లోటుని తీర్చేందుకు మాటమాటకూ పవన్ నామస్మరణ చేస్తున్నారు, టీడీపీ జనసేన ఘటబంధనం గురించి క్యాడర్ లోకి వెళ్లేలా చేస్తున్నారు అని అంటున్నారు. ఓట్ల బదిలీకి ఇదొక ఉపాయం, వ్యూహం అని కూడా అంటున్నారు. మొత్తానికి బాబు రాజకీయ గండర గండడు అని మరోసారి ఒప్పుకోవాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News