మళ్లీ వైసీపీ గెలిస్తే బాబు తీవ్ర నిర్ణయమా...!?

ఏపీలో వైసీపీ మరోసారి గెలవాలని చూస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి ఆశలు ఎటూ ఉంటాయి

Update: 2023-12-20 02:45 GMT

ఏపీలో వైసీపీ మరోసారి గెలవాలని చూస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి ఆశలు ఎటూ ఉంటాయి. వై నాట్ 175 సీట్స్ అని వైసీపీ బలమైన నినాదం ఇచ్చినా గత సారి వచ్చిన 151 సీట్ల కంటే కొన్ని తగ్గినా తమదే మరోమారు అధికారం అని అంతర్గతంగా లెక్కలేసుకుంటున్నారు. ఇక టీడీపీ ఈసారి ఏ చిన్న పొరపాటు చేయకుండా రాజకీయ వ్యూహం రూపొందిస్తోంది. దానికి ఉదాహరణ జనసేనతో చాలా ముందుగా పొత్తు కలపడం.

ఏకంగా చంద్రబాబు పదేళ్ల తరువాత పవన్ ఇంటికి వెళ్ళి సుదీర్ఘ భేటీ వేయడం. ఇక పవన్ సైతం వైసీపీ లేని ఏపీ అంటున్నారు. అదే విధంగా ఇతర పార్టీలను కలుపుకుని 2009లో మహా కూటమిని ఏర్పాటు చేసినట్లుగా ఈసారి చేసి జగన్ని గద్దె దించాలని చంద్రాబబు చూస్తున్నారు.

ఈసారి గెలుస్తామని చంద్రబాబు అంటున్నా ఆయన ఎందుకో కొన్నిసార్లు తడబడుతున్నారు. ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు మీడియా మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అదే విధంగా ఎపుడు మాదిరిగానే వైసీపీకి డిపాజిట్లు రావు అని కూడా అన్నారు.

అంటూనే మధ్యలో సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఏపీలో వైసీపీకి ఆల్టర్నేషన్ గా టీడీపీ అధికారంలోకి రాకపోతే తాము ఏపీకి దూరంగా ఉంటామని బాబు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంటే చావో రేవో అన్నట్లుగా టీడీపీ ఈసారి ఎన్నికలను తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఏదైనా ఇబ్బంది ఎదురై టీడీపీ ఓటమి పాలు అయితే మాత్రం తాను ఏపీకే రాను అని బాబు అనడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.

ఇది కావాలని బాబు ఎమోషనల్ గా చేసిన వ్యాఖ్య లేక ఆయన సీరియస్ గానే ఇలా మాట్లాడారా లేక దీని వెనక కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అన్న దాని మీద కూడా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. అయితే బాబు వంటి సీనియర్ ఎన్నికలు ముంగిట పెట్టుకుని ఈ విధంగా కామెంట్స్ చేయడం వల్ల పార్టీకి మేలు కంటే కీడే జరుగుతుంది అని అంటున్నారు.

బాబుకు ఆ విషయం తెలియదా అన్న చర్చ కూడా ఉంది. చంద్రబాబు ఏపీకి రాను అంటే అది రాజకీయ నేతగా ఆయన బాధ్యతలు పక్కన పెట్టినట్లే అంటున్నారు. సరిగ్గా మూడేళ్ళ క్రితం చంద్రబాబు ఏపీ అసెంబ్లీ రెయినీ సెషన్ వేళ తాను అసెంబ్లీకి రాను అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. దాంతో పాటుగా మళ్లీ తాను సీఎం గానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని కూడా చెప్పారు.

నిజానికి అప్పట్లోనే బాబు మీద విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా బాబుకు బాధ్యతలు ప్రజలు అప్పగిస్తే సీఎం అయితేనే సభలోకి వస్తాను అనడం ఎంతవరకూ సమంజసం అని కూడా వ్యాఖ్యానాలు చేసిన వారు ఉన్నారు అయితే రాజకీయాల్లో ఇలాంటి శపధాలు కొన్ని వర్కౌట్ అయ్యాయి కాబట్టి బాబుది ఒక వ్యూహం అనుకున్నారు.

కానీ 2024 ఎన్నికలో ఓడితే మాత్రం తాను ఏపీకి రాను అని బాబు అనడం పట్ల మాత్రం భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సర్వసాధారణం. ఎవరు ఓడినా ప్రజలు వారికి కూడా ఒక గురుతర బాధ్యత అప్పగిస్తారు. ప్రతిపక్ష పాత్ర కూడా చాలా కీలకమైనది. సీనియర్ మోస్ట్ నేతగా ఉంటూ ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు.

అయితే చంద్రబాబు మాత్రం ఈ తరహా కామెంట్స్ చేయడం వల్ల టీడీపీకి ఏమైనా డౌట్లు ఉన్నాయా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల ఫలితాలు ఉల్టా పుట్లా అయితే మాత్రం తీవ్ర నిర్ణయం దిశగానే అడుగులు వేస్తారా అన్న దాని మీద హాట్ హాట్ గానే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News