తొలిరోజు విచారణ ఎలా జరిగింది? ఎన్ని గంటలు జరిగింది?
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీ విచారణను చేపట్టారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీ విచారణను చేపట్టారు. బాబును విచారించేందుకు ఎడు గంటలు అవకాశం ఉన్నా.. ఐదు గంటలు మాత్రమే విచారణ సాగటం.. అందునా ప్రశ్నలకు కేవలం నాలుగు గంటలే కేటాయించిన పరిస్థితి ఎందుకన్నది ఆసక్తికరంగా మారింది. విచారణ వేళ ఏమేం పరిణామాలు చోటు చేసుకున్నాయి? విచారణ ఆలస్యానికి కారణం ఎవరు? ఎప్పుడు విచారణ ముగిసింది? లాంటి వివరాల్లోకి వెళితే..
చంద్రబాబు విచారణ షెడ్యూల్ కంటే ఆలస్యంగా మొదలైంది. కోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల మధ్య ప్రశ్నించాల్సి ఉంది. కానీ.. సీఐడీ అధికారులు పావు గంట ఆలస్యంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు మొయిన్ గుటు వద్దకు వెళ్లారు. దీంతో.. ఆలస్యంగా విచారణ ప్రారంభమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వేళకు.. వైద్య పరీక్షల్ని పూర్తి చేసుకున్న చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది.
విచారణకు ముందు పీఐడీ కస్టడీపై కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని చంద్రబాబుకు అందించారని.. దాన్ని పరిశీలించిన ఆయన ఆ కాపీని పూర్తిగా చదివినట్లుగా సమాచారం. అనంతరం.. అధికారులు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలను సంధించగా.. వాటికి చంద్రబాబు సమాధానాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో భోజన విరామాన్ని ఇచ్చారు. తొలిరోజున ఐదు గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ప్రశ్నించే వీలు కలిగినట్లుగా తెలుస్తోంది.
సీఐడీ అధికారుల్లో ఒకరు శనివారం సాయంత్రం 6.22 గంటల వేళలో జైలు నుంచి బయటకు రాగా.. మిగిలిన వారు మాత్రం సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చారు. దీంతో.. మొదటి రోజు కస్టడీ ముగిసినట్లైంది. విచారణ ముగిసిన తర్వాత చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు జరిపి.. ఆయన్ను జైలు గదికి పంపినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు (ఆదివారం) మరోసారి విచారణ చేపట్టనున్నారు. దీంతో.. రిమాండ్ గడువు ముగుస్తుంది. చంద్రబాబును ప్రశ్నించిన సీఐడీ అధికారులకు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ లో బస ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. విచారణ వేళ.. జైలుఆవరణలో చోటు చేసుకున్న ఒక పరిణామం ఒకలాంటి అయోమయాన్ని కలిగించటం గమనార్హం.
సీఐడీ అధికారులు జైలు లోపలకు వెళ్లిన కాసేపటికి.. చంద్రబాబు కాన్వాయ్ వాహనాలు జైలు వద్దకు చేరుకున్నాయి. దీంతో.. అసలేం జరిగింది? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. దీనిపై అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జైలుకు వెళ్లిన రోజు నుంచి ఇప్పటివరకు జైలు వద్దకు చంద్రబాబు కాన్వాయ్ వాహనాలు వచ్చింది లేదు. అలాంటిది ఒక్కసారిగా వాహనాలు వచ్చేసరికి అయోమయం వ్యక్తమైంది. అయితే.. కాసేపటికిఆ వాహనాల్ని ఆర్ అండ్ బీ గెస్టు హౌస్ కు పోలీసులు తరలించారు. ఎందుకిలా జరిగింది? అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.