జగన్ అన్న దానికి నేను ఓకే అంటున్న బాబు...!
ఆశ్చర్యం అంటే ఇదే. ఏపీ రాజకీయాల్లో జగన్ చంద్రబాబుల మధ్య రాజకీయాలకు మించిన వైరం సాగుతూ ఉంటుంది
ఆశ్చర్యం అంటే ఇదే. ఏపీ రాజకీయాల్లో జగన్ చంద్రబాబుల మధ్య రాజకీయాలకు మించిన వైరం సాగుతూ ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇద్దరి మధ్య సీఎం విపక్ష నేత రెండు రాజకీయ పార్టీల అధినేతలు అన్నది అసలు ఎక్కడా ఏ కోశానా కనిపించదు. రాజకీయ ప్రత్యర్ధులు అన్నది దాటిపోయి శత్రువులుగా కత్తులు దూసుకునే పరిస్థితి ఉంది.
జగన్ ఎడ్డెం అంటే బాబు తెడ్డెం అంటారు. అలాంటిది ఈ ఇద్దరి మధ్య ఒక విషయంలో అయితే అంగీకారం కుదిరింది. జగన్ అన్న దానికి నేను ఓకే అంటూ చంద్రబాబు గోదావరి జిల్లాలో జరిగిన ప్రజాగళం సభలో చెప్పి సంచలనం రేపారు.
జగన్ నన్ను పశుపతి అంటున్నారు. దానికి నేను ఓకే అంటున్నా అని బాబు భలే ట్విస్ట్ ఇచ్చారు. జగన్ అరుంధతి సినిమాలో విలన్ అయిన పశుపతి క్యారెక్టర్ చంద్రబాబుది అని అన్నారు. అలా అధికారం కోసం బాబు పసుపు పతిగా మారి ముందుకు వస్తున్నారు. సమాధి నుంచి వచ్చే పశుపతి టైప్ లో బాబు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని జగన్ హెచ్చరించారు.
బాబుని కట్టడి చేయాలని ఓడించి పంపాలని ఆయన జనాలకు పిలుపు ఇస్తూ బాబుని పశుపతిగా చేశారు. దానికి చంద్రబాబు ఎస్ నేనే పశుపతి అంటూ జగన్ కి కౌంటర్ ఇచ్చారు. అవును పశుపతి అని జగన్ అన్నారు. అందులో తప్పేముంది. పశుపతి అంటే శివుడు. లోకాన్ని కాపాడే శివుడు పాత్రలోనే నేను ఉన్నాను. ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది, నష్టపోయింది, ఏపీ సర్వనాశనం అయింది. అందుకే దాన్ని రక్షించడానికి నేను పశుపతి అవతారమే ఎత్తాను, జగన్ కరెక్ట్ గానే చెప్పారు అంటూ జగన్ అన్న దానికి ఓకే చేశారు.
మొత్తానికి చూస్తే బాబు పొలిటికల్ కెరీర్ లో ఈ తరహా సెటైర్ కానీ కౌంటర్ కానీ ఎపుడూ చూడలేదు. ఆయన ప్రత్యర్థుల మీద ఘాటు విమర్శలే చేస్తూ ఉంటారు. అటు నుంచి ఏమి వచ్చినా ఆయన దానికి లైట్ తీసుకునే సీన్ ఉండదు. కానీ పశుపతి అని జగన్ అంటే మాత్రం బాబు ఓకే అంటూ పవర్ ఫుల్ కౌంటర్ ఇవ్వడమే కాదు పశుపతి అంటే శివుడని అసలైన అర్థం చెబుతూ తనకు అనుకూలంగా ఆ విమర్శను కూడా మార్చుకున్నారు.
మొత్తానికి చంద్రబాబులో ఈ టైప్ సెటైర్లు ని కౌంటర్లను చూసిన వారు బాబు అప్టూ డేట్ గానే ఉంటున్నారు అని అంటున్నారు. బాబుకు రొటీన్ స్పీచ్ రొడ్డకొట్టుడు ప్రసంగాలు చేయడం తప్ప ట్విస్టులు ఇవ్వడం రాదు అనుకున్న వారిని తాను ఏంటో చూపించారు. అంతే కాదు జగన్ విమర్శలనే తనకు అనుకూలం చేసుకుని ఔరా అనిపించారు. దీనిని చూసిన వారు అంతా దటీజ్ బాబు అని అనకుండా ఉండలేరేమో.