భిక్షాటన చేస్తూ విదేశీయులను వెంబడించిన చిన్నారులు.. వీడియో వైరల్!
అవును... భారత పర్యటనకు వచ్చిన కొంతమంది విదేశీయులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
"భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం"... ఎంతో కాలంగా వింటున్న మాట! అభివృద్ధి చెందటం అంటే ధనవంతులు ఎక్కువగా ఉండటం కాదు.. సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండిపోవడం కాదు.. పేదల సంఖ్య తక్కువగా ఉండటం అని, బిక్షాటన చేసేవారు కనిపించకుండా ఉండటం అని చాలా మంది ఈ అభివృద్ధిని నిదర్శనంగా చెబుతుంటారు.
ఆ సంగతి అలా ఉంటే... దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణమైన ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... దేశరాజధాని ఢిల్లీలో భిక్షాటన చేస్తున్న భావి భారత పౌరులు... విదేశీయుల వెంట పడ్డారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
అవును... భారత పర్యటనకు వచ్చిన కొంతమంది విదేశీయులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇందులో భాగంగా వారు ప్రయాణిస్తున్న ఆటోను కొంతమంది చిన్నారులు వెంబడించారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు.. వాహనం వెనుక పరిగెత్తగా... మరో బాలిక ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది.
ఈ నేపథ్యంలో... ఈ బాలికల చర్యతో విదేశీ పర్యాటకులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో... ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డ్ చేస్తూ... "ఇది అత్యంత దారుణమైన విషయం.. ఏమి జరుగుతుందో నమ్మలేకపోతున్నాం" అని ఓ పర్యాటకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు... విదేశీ పర్యటకులు చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని విమర్శలు గుప్పించారు. నేతలు ఊకదంపుడు ఉపన్యాశాలు ఇచ్చే ముందు ఇలాంటి విషయాలపైనా దృష్టి సారించాలని మరికొంతమంది అంటున్నారు. ఢిల్లీలో ఇలా బిక్షాటన చేసే బాలబాలికల సంఖ్య సుమారు 35 వేల వరకూ ఉంటుందని యూత్ రీచ్ అనే ఎన్జీవో వెల్లడించింది!