తైవాన్ కథ తేల్చుస్తుందా.. డ్రాగన్? అమెరికా ఏం చేస్తుందో?
తైవాన్ అసలు దేశమేనా? అంటే దీనికి సమాధానం.. కాదు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో మొత్తం దేశాలు 193
ఇప్పటివరకు మనం కొన్ని వస్తువులపై 'మేడిన్ తైవాన్' అని చూస్తున్నాం. ఇకపై ఆ పేరుండదేమో..? చిప్ పరిశ్రమకు చిక్కులు తప్పవేమో..? అంతర్జాతీయంగా మరో సంక్షోభం ఎదుర్కొనక తప్పదేమో? పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. వన్ చైనా.. మన తెలుగులో చెప్పాలంటే 'ఒక్కటే చైనా' ఇది డ్రాగన్ దేశ నినాదం. చిన్న ద్వీపమైన తైవాన్ స్వతంత్రతను చైనా ఎప్పడూ ఒప్పుకోదు. మిగతా ప్రపంచం అంతా తైవాన్ పరోక్షంగానైనా ఓ దేశంగా గుర్తిస్తుంటే..చైనా మాత్రం ఆ పేరు వింటేనే తోక తొక్కిన తాచులా లేస్తుంది.
సరిగ్గా ఏడాది కిందట అమెరికా చట్ట సభల స్పీకర్, ఫైర్ బ్రాండ్ లేడీ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన కలకలం రేపిన సంగతి గుర్తుందా..? పెలోసీ బయల్దేరిన దగ్గరనుంచి వాతావరణం అంతా ఉద్రిక్తంగా సాగింది. చివరకు ఆమె తైవాన్ లో కాలిడి తాను అనుకున్నది సాధించారు. ఇక నెల కిందట తైవాన్ మంత్రి తన పర్యటనలో భాగంగా అమెరికాలో ఆగడంపై చైనా అగ్గిమీద గుగ్గిలంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిక్కులన్నీ ఎందుకనుందేమో? తైవాన్ ఎప్పటికైనా తలనొప్పి అనుకుందేమో? ఈ ద్వీప దేశాన్ని తనలో కలిపేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అసలు దేశమేనా?
తైవాన్ అసలు దేశమేనా? అంటే దీనికి సమాధానం.. కాదు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో మొత్తం దేశాలు 193. వాటికన్ సిటీ, పాలస్తీనా పరిశీలన హోదాలో ఉన్న దేశాలు. మరో రెండు దేశాలు తైవాన్, కొసావో. అయితే, తైవాన్ దేశమైనప్పటికీ చైనాకు భయపడి మిగతా ఏ దేశమూ దానిని గుర్తించడం లేదు. ఇక కొసావో.. సెర్బియా సమీపంలో ఉంటుంది. అన్ని ప్రమాణాల్లోనూ కొసావో దేశమే అయినా ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు. దీంతో ఎవరూ దేశంగా గుర్తించడం లేదు. కాగా, చైనా-తైవాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తైవాన్‌ను విలీనం చేసుకొనే దిశగా డ్రాగన్ దుందుడుకు చర్య చేపట్టింది.
యుద్ధనౌకాలను మోహరించి..
తైవాన్ ను బెదిరించేందుకు తరచూ చైనా చేసే ప్రయత్నం.. ఆ ద్వీప దేశం చుట్టూ సైనిక విన్యాసాలు సాగించడం. ఇప్పుడూ అలానే తైవాన్ ను కలిపేసుకునేందుకు ఏకంగా ప్రణాళికనే ఆవిష్కరించింది. దీనికి ముందు.. తైవాన్‌ను బెదిరించేందుకు ద్వీపం దిశగా చైనా యుద్ధనౌకలను పంపించింది. చైనాలో తీర ప్రావిన్స్ ఫుజియాన్, తైవాన్ మధ్య జలసంధుల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే విధంగా డ్రాగన్ ఇటీవల ప్రణాళికను ఆవిష్కరించింది. తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్ అంటూ చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. కాగా, తైవాన్‌తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌ను 'ప్రత్యేక జోన్'గా మార్చడం ఇందులో వ్యూహం. తైవాన్ నివాసితులు చైనాలో స్థిరపడేందుకు, వ్యాపారాలు చేసేందుకు వీలుగా ఫుజియాన్‌ను 'ఫస్ట్ హోం'గా పేర్కొంటూ ప్రణాళికను ఆవిష్కరించినట్లు డ్రాగన్ మీడియా పేర్కొంటోంది. ఇప్పటికే తైవాన్ చుట్టూ యుద్ధ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో 'ప్రణాళిక' అనే ఎత్తుగడ వేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది.
రెచ్చగొట్టిన అమెరికా, కెనడా
గత వారం చివరలో అమెరికా, కెనడా యుద్ధనౌకలు తైవాన్ జలసంధిలో ప్రయాణించాయి. ఇది ఓ రకంగా చైనాను సవాల్ చేసినట్లు. దీంతోనే గతంలో చేసినట్లే చైనా సుర్రుమంది. తన యుద్ధనౌకల దండును తైవాన్ జలసంధిలోకి పంపింది. యుద్ధవిమానాలు, జలాంతర్గాముల సన్నద్ధత, విన్యాసాలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరిప్పుడు అమెరికా ఏమంటుందో చూడాలి. గతంలోనూ అగ్ర రాజ్యం పలుసార్లు తైవాన్ కు బహిరంగంగానే మద్దతు తెలిపిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.