జయా బచ్చన్ - జగదీప్ మధ్యలో సోనియా... ఒక్కసారిగా వేడెక్కిన రాజ్యసభ!
అవును... ‘జయా బచ్చన్’పేరును ‘జయా అమితాబ్ బచ్చన్’ గా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సంభోధించడంతో ఈ రోజు పార్లమెంటులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
రాజ్యసభలో శుక్రవారం చైర్ పర్సన్ జగదీప్ ధన్ ఖడ్ - సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తన పేరు పలికే విషయంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జయా బచ్చన్ కు మద్దతుగా సోనియా కూడా ఎంటరయ్యారు. ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో.. ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.
అవును... ‘జయా బచ్చన్’పేరును ‘జయా అమితాబ్ బచ్చన్’ గా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సంభోధించడంతో ఈ రోజు పార్లమెంటులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తన పేరు అలా పలకడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో... ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగదీప్... "నాకు పాఠాలు చెప్పొద్దు" అంటూ తీవ్రంగా స్పందించారు.
ఈ సమయంలో స్పందించిన జయా బచ్చన్.. "మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు" అని అన్నారు. తనపేరు జయా బచ్చన్ అని, తానొక నటినని.. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ ను తాను అర్ధం చేసుకోగలనని చెబుతూ.. ఈ నేపథ్యంలోనే మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదు అని అన్నారు. ఇదే క్రమంలో.. ఇద్దరం సహచరులం, కాకపోతే మీరు స్పీకర్ స్థానంలో కూర్చుని ఉండోచ్చు అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో... జయాబచ్చన్ మైక్ కట్ చేశారు ధన్ ఖడ్. అనంతరం ఆమె పై అసహనయం వ్యక్తం చేస్తూ, కూర్చోవాలంటో చేతులతో సైగలు చేసి సూచించారు. ఈ నేపథ్యంలోనే తనకు పాఠాలు చెప్పొదంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నటి కావొచ్చు, సెలబ్రెటీ అయితే అవ్వొచ్చు కానీ సభలో మర్యాదగా మెలగాలంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో విపక్ష సభ్యుల నుంచి సభలో పెద్దేత్తున అరుపులు, కేకలు మొదలైన పరిస్థితి.
ఆ అరుపులు, కేకల మధ్యే మరోసారి స్పందించిన ధన్ ఖడ్... "జయా బచ్చన్ మీరు గొప్ప పేరు సంపాదించారు కానీ... నటులు దర్శకుడికి లోబడే ఉంటారని మీకు తెలుసు" అంటూ.. తాను ఇబ్బందిపెట్టే వ్యక్తి కాదని, తన స్వరం గురించి మాట్లాడటం సరికాదని ఫైర్ అయ్యారు. దీంతో ఆమెకు మద్దతుగా సోనియా గాంధీ వాకౌట్ చేయగా.. ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా బయటకు వెళ్లిపోయారు.
అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తాను ఐదోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తుచేసిన జయా బచ్చన్... సభలో ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలొ తనకు తెలుసని తెలిపారు. ఇటువంటి ప్రవర్తన గతంలో ఎన్నడూ చూడలేదని.. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా... ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్... "జయా అమితాబ్ బచ్చన్" మాట్లాడాలి అని ఆహ్వానించారు. దీనిపై రియాక్ట్ అయిన జయా బచ్చన్... తనను "జయా బచ్చన్" అంటే సరిపోదుందని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా... "రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది" అని హరివంశ్ నారాయణసింగ్ తెలిపారు. దీంతో... తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జయా బచ్చన్.. మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.