తెలంగాణ సాకారంతో నా జ‌న్మ చ‌రితార్థం: సీఎం కేసీఆర్ భావోద్వేగం

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2023-09-17 07:40 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గుర‌య్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో `జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు` ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. తొలుత‌ గన్‌పార్క్‌ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు. అన‌త‌రం పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సాకారం కోసం ఎంతో కృషి చేయాల్సి వ‌చ్చింద‌ని.. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌తో త‌న జ‌న్మ చ‌రితార్థం అయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గుర‌య్యారు. రెండు సెక‌న్ల‌పాటు మౌనంగా ఉండిపోయిన అనంత‌రం మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేకత ఉందన్నారు. హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజును.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామని తెలిపారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ఆవిర్భావం నుంచి స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకుంటున్న‌ట్టు తెలిపారు.

తెలంగాణ నేలపై అనేక పోరాటాలు జరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. అనేక మంది త‌మ ప్రాణాలను తృణప్రాయంగా భావించి.. గుండెలు ఎదురొడ్డి నిలిచారని కొనియాడారు. ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తాయని కేసీఆర్ అన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో యోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు.

తెలంగాణ సాధనతో తన జన్మ సార్ధకమైందని, దేశం ఇప్పటికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని, తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం లేకున్నా.. తెలంగాణ చేప‌ట్టిన అనేక ప‌థ‌కాలు.. రాష్ట్రాన్ని ముందుకు న‌డిపిస్తున్నాయ‌న్నారు.

ద‌ళిత బంధు ప‌థ‌కం దేశంలోని ఏ రాష్ట్ర‌లోనూ అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. త‌ద్వారా ద‌ళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామ‌న్నారు. ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇచ్చామన్నారు. ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని కేసీఆర్ వెల్ల‌డించారు.

Tags:    

Similar News