వామ్మో... సీఎం రమేష్ మామూలోడు కాడంతే !

ఇవన్నీ పక్కన పెడితే అనకాపల్లిలో కీలక నేతల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది.

Update: 2024-04-25 03:54 GMT

ఎక్కడో ఉన్న కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేష్ బలమేంటి ఆయన రాజకీయమేంటి అన్నది అనకాపల్లి వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సీఎం రమేష్ రాజకీయ చక్రం గిర్రున తిరుగుతోంది. లోకల్ నుంచి ఢిల్లీ దాకా అందరితో ఆయనకు ఉన్న పరిచయాలు చూసిన వారు అంగబలం అర్ధబలం ఉన్న నేత అంటే ఆయనే అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అనకాపల్లిలో కీలక నేతల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేసిన దాడి వీరభద్రరావు చింతకాయల అయ్యన్నపాత్రుడులకు అన్న ఎన్టీయార్ లైఫ్ ఇచ్చారు. ఇద్దరినీ మంత్రులుగా చేశారు.

ఈ ఇద్దరూ అనకాపల్లి నర్శీపట్నంలకు చెందిన వారు. పక్క పక్కనే ఊర్లు ఉన్నా ఒకే పార్టీలో ఉన్నా రాజకీయంగా మాత్రం విభేదించుకునేవారు. పై చేయి కోసం ఆధిపత్య పోరు సాగించేవారు. ఇది దశాబ్దాల పాటు అలా కొనసాగుతూనే వచ్చింది. దాడి ఈ మధ్యలో పార్టీలు మారి తిరిగి టీడీపీ గూటికి వచ్చారు. అయినా వైరం అలాగే ఉంది.

అయితే సీఎం రమేష్ అనకాపల్లి నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి కావడం కాదు కానీ ఇద్దరు ప్రత్యర్ధులను కలిపేశారు. మొదట అయ్యన్నపాత్రుడి దగ్గరకు వెళ్ళిన రమేష్ ఆనక దాడి వద్దకూ వెళ్లారు. కట్ చేస్తే చివరికి సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమంలో దాడి అయ్యన్న ఇద్దరూ పక్కపక్కనే నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజు ఇవ్వడాన్ని చూసిన వారు దశాబ్దాలుగా టీడీపీ అధినాయకత్వం చేయలేని పనిని సీఎం రమేష్ చేసేసారు అని వ్యాఖ్యానిస్తున్నారు.

అంతే కాదు అనకాపల్లి పరిధిలో చూస్తే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకి దాడికి మధ్య ఆరని చిచ్చు అలా రేగుతూనే ఉంది. అయితే సీఎం రమేష్ చొరవతో ఇద్దరు నేతలూ కలసిపోయారు. దాడి ఇంటికి స్వయంగా కొణతాల వెళ్తే ఆప్యాయంగా దాడి ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత కొణతాలకు మద్దతుగా దాడి ప్రచారం మొదలెట్టేశారు.

దీంతో దశాబ్దాల వైరం కాస్తా చెక్ పెట్టినట్లు అయింది. సీఎం రమేష్ కి అందరూ కావాలి.ఆయన విజయానికి అంతా సహకరిస్తేనే ఎంపీ అయ్యేది. దాంతో ఆయన ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంటూ వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ చివరికి ప్రత్యర్ధులను ఒకటి చేశారు అని అంటున్నారు. సీఎం రమేష్ కి టికెట్ కేటాయించినప్పటికి అనకాపల్లిలో నేతల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్లుగా ఉంది. ఎవరి దారి వారిదే అన్నట్లుగా సీన్ ఉంది. కానీ ఒక్కోటీ రిపేరు చేసుకుంటూ నామినేషన్ వేళకు గ్రూప్ ఫోటోలోకి అందరికీ లాగేసారు సీఎం రమేష్ అంటున్నారు. ఇదే ఊపుని ఆయన కంటిన్యూ చేస్తే కనుక ఎన్నికలలో ఫలితాలు కూడా పాజిటివ్ గా మారవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News