బాబుని మెచ్చుకుంటున్న కాంగ్రెస్ !
ఏపీలో వైసీపీ మాత్రమే టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తోంది. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా కూటమికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాయి.
ఏపీలో వైసీపీ మాత్రమే టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తోంది. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా కూటమికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాయి. నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు చేసుకున్న అదృష్టం ఇది అని అనుకోవచ్చు. దానితో పాటు వైసీపీ పాలనను చూసిన తరువాత బాబు బెటర్ అన్న భావన కూడా కావచ్చు.
ఏ మాట ఆ మాట చెప్పుకోవాలీ అంటే సగటు ప్రజానీకంలోనూ గతంలో బాబు పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉండేది. కానీ అయిదేళ్ల వైసీపీ పాలన చూసిన తరువాత వారికి బాబులో ఉత్తమ పాలకుడు కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఆ తేడాను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన జగన్ కి నిజంగా బాబు థాంక్స్ చెప్పుకోవాల్సింది అని అంటున్నారు.
ఇక వామపక్షాలు కూడా టీడీపీ కూటమి పాలన సవ్యంగా సాగాలనే కోరుకుంటున్నారు. ఉభయ వామ పక్షాలకు చెందిన రాష్ట్ర అధినేతలు బాబుని కలసి వచ్చారు. ఆయన పాలనలో బాగున్నవి చెప్పి మరీ సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చారు.
ఇక లేటెస్ట్ గా కాంగ్రెస్ సీనియర్ నేత సీడబ్ల్యూసీ మెంబర్ కూడా అయిన ఎన్ రఘువీరారెడ్డి సైతం బాబు పాలనను మెచ్చుకున్నారు. ఇది నిజంగా గొప్ప విషయమే అని అంటున్నారు. రఘువీరా సీఎం చంద్రబాబు మడకశిర పర్యటన మీద సంచలన వ్యాఖ్యలే చేశారు.
చంద్రబాబు సీఎం హోదాలో పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమాన్ని సైతం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నిర్వహించారు అని రఘువీరా మెచ్చుకున్నారు అంటే బాబుకు అది మెచ్చుతునకే అని భావించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి బలవంతంగా జనాలను సమీకరించలేదని ఆయన చెప్పారు. స్వచ్ఛందంగా వచ్చిన జనాలతోనే బాబు నేరుగా మాట్లాడటం గొప్ప విషయం అని రఘువీరా అన్నారు.
ఇక గడచిన పదేళ్లుగా మడకశిర ప్రజలు అనేక సమస్యల్తో సతమతమవుతున్నారని వాటిని పరిష్కరించేలా ఆ దేవుడు బాబుకు మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నట్లుగా రఘువీరా చెప్పారు. మొత్తానికి చూస్తే బాబు కాంగ్రెస్ తీవ్రంగా విభేదించే ఎన్డీయే కూటమిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ కి పడదు.
అయినా సరే బాబు పట్ల కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ఎవరూ కూడా ఏమీ అనని వాతావరణం ఉంది. ఏపీ కాంగ్రెస్ నాయకులు అయితే బాబు పట్ల సాఫ్ట్ కార్నర్ తోనే ఉంటున్నారు అని అంటారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం వైసీపీనే విమర్శిస్తూ వస్తున్నారు.
ఆమె సంగతి పక్కన పెడితే రఘువీరా కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నారు. ఆయన బాబు పాలన బాగుందని మెచ్చుకోవడం అంటే ఒక విధంగా కాంగ్రెస్ ని సైతం మెప్పించిన బాబుకు ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఎదురు లేదని అంటున్నారు. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందని ఈ మధ్యన జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న రఘువీరా ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం అంటే కాంగ్రెస్ ఏపీ విషయంలో ఆప్షన్లు అలా ఉంచుకుందా అన్న చర్చ అయితే సాగుతోంది.