ఎన్నికల వేళ కాంగ్రెస్‌ కు కొత్త కష్టాలు!

కొద్ది రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రూ.65 కోట్లను ఫ్రీజ్‌ చేసింది. అలాగే బ్యాంకు ఖాతాల్లోని మొత్తం రూ.210 కోట్లను స్తంభింపజేసింది.

Update: 2024-03-14 12:30 GMT

దాదాపు 40 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రూ.65 కోట్లను ఫ్రీజ్‌ చేసింది. అలాగే బ్యాంకు ఖాతాల్లోని మొత్తం రూ.210 కోట్లను స్తంభింపజేసింది. దీంతో ఆ పార్టీకి ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి.

దేశంలో కేవలం తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోక్‌ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ దగ్గర డబ్బు లేదని, తీవ్రస్థాయిలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్తంభింపజేసిందని మండిపడ్డారు. ఆ ఖాతాల్లో ప్రజలు విరాళంగా ఇచ్చిన నగదు ఉందని తెలిపారు.

అదంతా ప్రజలు పార్టీకి విరాళంగా ఇచ్చిన నగదు అని ఖర్గే వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం దాన్ని ఫ్రీజ్‌ చేసిందని వాపోయారు. ఇప్పుడు ఖర్చు పెట్టడానికి తమ దగ్గర డబ్బులేదన్నారు. బీజేపీ మాత్రం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు బయటపెట్టడానికి వెనకాడుతోందని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా రావాలని, కాంగ్రెస్‌ ను గెలిపించాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

రూ.100 కోట్ల ఆదాయపు పన్ను బకాయి వివాదంలో కాంగ్రెస్‌ పార్టీ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ మొత్తం వసూలుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుపై స్టే విధించడానికి ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా కాంగ్రెస్‌ పార్టీకి ఉపశమనం దక్కలేదు.

కాగా 2018–19 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌ పార్టీకి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. వీటికి సమాధానం కోరింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ నోటీసులకు స్పందించలేదు.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. పన్ను రికవరీ నిమిత్తం ఇటీవల పార్టీకి నోటీసులు జారీ చేసింది.

2018–19 మదింపు సంవత్సరానికి కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ పన్ను రూపంలో రూ.102 కోట్లు చెల్లించాల్సి వుంది. అది వడ్డీతో కలిపి రూ.135.6 కోట్లకు చేరింది. ఈ క్రమంలో ఈ మొత్తంలో రూ.65.94 కోట్లను ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు మినహాయించుకున్నారు.

ఈ నేపథ్యంలో తమ ఖాతాలపై ఆదాయపన్ను విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. అయితే రెండు చోట్లా ఆ పార్టీకి నిరాశే ఎదురైంది.

Tags:    

Similar News