కాంగ్రెస్ జోష్.. విప్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల అభ్యర్థుల ప్రకటన
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు పెద్దఎత్తున సమాయత్తం అవుతోంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు పెద్దఎత్తున సమాయత్తం అవుతోంది. ఇప్పటికే సర్వేలన్నీ అనుకూలంగా ఉండగా.. అంతకుమించిన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఆశ్చర్యకర ఎంపికలు ఉండడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ వంటి అత్యంత కీలకమైన పదవి ఎవరికి ఇవ్వనుందో ప్రకటించింది.
అత్యంత కీలక పదవి
అసెంబ్లీ లో సీఎం తరఫున బాధ్యతలు చక్కబెట్టేది చీఫ్ విప్. ప్రభుత్వ గళాన్ని బలంగా వినిపించే పదవి ఇది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి మూడు నెలలు అయినా.. ఈ పదవిని ఎవరికి ఇవ్వాలో ఇంతకాలం నిర్ణయించలేదు. మల్ రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నాయకుడికి ఇస్తారని కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డిని నియమించింది.
ఇలా చేరి అలా టికెట్..
చేవెళ్ల, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ లను ఎంపిక చేశారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున సిటింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే, ఆయనకు టికెట్ దక్కలేదు. మరోవైపు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య దాగుడుమూతలు ఆడుతున్నారు. ఆదివారం వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. వెంటనే ఎంపీ టికెట్ లు సాధించారు.
మల్కాజిగిరిలో అనూహ్య ఎంపిక
దేశంలో అతిపెద్ద నియోజకవర్గం, మొన్నటివరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మల్కాజిగిరి. అలాంటి సీటు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకం. అక్కడినుంచి ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి ని ప్రకటించారు. ఆమె చీఫ్ విప్ గా నియమితులైన మహేందర్ రెడ్డి సతీమణి. బీఆర్ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గానూ ఉన్నారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే ఈ దంపతులు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి బీఆర్ఎస్ బుజ్జగించింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇప్పుడు మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరారు.