రాజకీయ క్షేత్రంలో వారసుల సమరం!
రాజకీయాల్లో వారసత్వం అనేది కామన్. ఒక్కసారిగా రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఎవరైనా, పదవులు అనుభవించిన వాళ్లు అయినా తమ వారసులను రాజకీయాల్లోకి దింపాలనే చూస్తారనడంలో సందేహం లేదు.
రాజకీయాల్లో వారసత్వం అనేది కామన్. ఒక్కసారిగా రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఎవరైనా, పదవులు అనుభవించిన వాళ్లు అయినా తమ వారసులను రాజకీయాల్లోకి దింపాలనే చూస్తారనడంలో సందేహం లేదు. ఇక ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకుల వారసుల హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికల్లో పోటీలో నిలబడి.. విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసులు తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో అత్యధిక మంది తొలిసారి ఎన్నికల సమరంలో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్న వాళ్లే.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో వారసుల మధ్యే ప్రధాన పోటీ ఉందని చెప్పొచ్చు. తన చివరి రోజుల్లో దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేలా కనిపించారు కూడా. కానీ గద్దర్ మరణించారు. ఆయనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ కేటాయించింది. మరోవైపు దివంగత ఎమ్మెల్యే తనయ లాస్య బీఆర్ఎస్ నుంచి ఓట్ల వేటలో సాగుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో చూడాలి. మరోవైపు కోరుట్ల నుంచి ఈ సారి విద్యాసాగర్ తనయుడు సంజయ్ కు కేసీఆర్ అవకాశం కల్పించారు. కొడుకు కోసం ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ తన సీటును త్యాగం చేశారు.
మరోవైపు ఈ సారి ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన చిన్న కొడుకు జై వీర్ రెడ్డికి కు నాగార్జున సాగర్ టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ నియోజకవర్గంలో తనయుడి గెలుపు కోసం జానారెడ్డి ప్రచారంలో మునిగిపోయారు. దివంగత కాంగ్రెస్ నేత పి.జానార్ధన్ రెడ్డి తనయ విజయారెడ్డి ఈ సారి ఖైరతాబాద్ లో నిలబడ్డారు. ఇక పి.జనార్ధన్ రెడ్డి కొడుకు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసింది. మరోవైపు మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ లో తనకు టికెట్ వచ్చినా తన కొడుక్కి అవకాశం ఇవ్వకపోవడంతో మైనంపల్లి హన్మంతరావు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లి రెండు టికెట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్లొ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ బీజేపీ నుంచి, నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కొడుకు రాజేశ్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. మరి వీళ్లలో గెలిచి అసెంబ్లీ వెళ్లేదెవరో చూడాలి.