జగన్ మీద మోడీని ఉసిగొలుపుతున్నదెవరు ?
జగన్ కేసుల విషయంలో బీజేపీ పెద్దలు ఉదాశీనంగా ఉన్నారు అన్నట్లుగా నారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఆయన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తరువాత అతి పెద్ద ఇబ్బంది అప్పట్లో వచ్చింది. అయితే ఆయన జైలులో ఉన్నా బయట ఉన్నా అసంఖ్యాకమైన ప్రజాభిమానం ఆయనకు దన్నుగా ఉండేది. వైఎస్సార్ ని అభిమానించే నాయకులు అంతా జగన్ వెంట ఉండేవారు.
అందుకే 2014 ఎన్నికల్లో జగన్ ఓడినా కూడా ఇంతలా పార్టీ ఇబ్బంది పడింది లేదు. ముందుంది మంచి కాలం అన్నట్లుగా క్యాడర్ లీడర్ అంతా వ్యవహరించారు. కానీ ఇపుడు చూస్తే అలా లేదు. వైఎస్సార్ తో ఉన్న వారు వైసీపీ పునాదుల నుంచి ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరూ వైసీపీ నుంచి జారుకుంటున్నారు.
మరి వారంతా వైసీపీ తిరిగి మళ్లీ అధికారంలోకి రాదు అని భావిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే సమయంలో వైసీపీలో క్యాడర్ అయితే చాలా కాలంగా నిర్లిప్తంగా ఉంది. క్యాడర్ కి లీడర్ కి లీడర్ కి అధినాయకత్వానికి మధ్యన అతి పెద్ద అగాధం ఏర్పడి చాలా ఏళ్ళు అయింది.
దానిని పూడ్చే కార్యక్రమం అయితే మెల్లగా మొదలైంది కానీ ఇంకా అది తొలి దశలోనే ఉంది. 2024 ఎన్నికల్లో లభించిన భారీ ఓటమి ఇంకా పచ్చిగా ఉండి వైసీపీకి ఆరని పుండుగా మారి బాధిస్తోంది. దాంతో అధినాయకుడు జగన్ నుంచి కింద స్థాయి కార్యకర్త దాకా ఎవరూ తేరుకోలేకపోతున్న నేపథ్యం ఉంది.
ఇంతలో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని వైపుల నుంచి వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా సొంత ఇంట్లో కూడా ఆస్తుల వివాదం జగన్ కి చికాకు పెడుతోంది. ఆయనకు ఇంటా బయటా కూడా సమరమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీదకు ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీని ఆయన ఉసిగొలుపు తున్నట్లుగా చేసిన ఈ కామెంట్స్ రాజకీయంగా ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి.
మాయల ఫకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లుగా జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని లేటెస్ట్ గా నారాయణ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా బిగ్ డిబేట్ కి ఆస్కారం కల్పిస్తున్నాయి. జగన్ కేసుల విషయంలో బీజేపీ పెద్దలు ఉదాశీనంగా ఉన్నారు అన్నట్లుగా నారాయణ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ఏకంగా 11 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారని ఆయన అసలు కోర్టుకు వెళ్లడం లేదని నారాయణ సూటిగానే టార్గెట్ చేశారు. ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్న నాయకుడు బహుశా జగనే అని ఆయన అంటునారు.
ఇన్నేళ్ళ కాలంలో జగన్ ఆస్తుల కేసులు ఒక పరిష్కారానికి రాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ ఆస్తుల మీద వివాదాలు మాత్రం ఆయన సొంత ఇంట్లో నుంచే మొదలయ్యాయని అన్నారు. ఆస్తుల పంచాయతీ అన్నా చెల్లెళ్ల మధ్యన సాగుతోందని అన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జగన్ కేసుల వ్యవహారం మీద దృష్టి సారించాలని నారాయణ డిమాండ్ చేస్తున్నారు. అపుడు ఆయన ఆస్తుల పంచాయతీ కూడా తేలిపోతుందని చెబుతున్నారు.
ఈ విధంగా నారాయణ మాట్లాడడం ద్వారా అటు బీజేపీ జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉందా అన్న అనుమానాలు టీడీపీ కూటమి పెద్దలలో కలుగచేశారు అని అంటున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం జగన్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోందా అన్న చర్చకు తెర తీశారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ కేసుల విషయంలో కేంద్రం తీక్షణంగా ఒక చూపు చూడాలని ఈ కమ్యూనిస్టు నాయకుడు బలంగా కోరుకుంటున్నట్లుగా ఉంది. మరి కేంద్ర బీజేపీ పెద్దల చేతిలో నిజంగా జగన్ కేసుల వ్యవహారం ఉందా లేదా అన్నది చూడాలి.
సీబీఐ కోర్టులో జగన్ కేసుల మీద విచారణ సాగుతోంది. అక్కడే ఒక తీర్పు రావాల్సి ఉంది. ఇక జగన్ బెయిల్ మీద నారాయణ మాట్లాడారు. దాని మీద అయితే సీబీఐ కోర్టులో సవాల్ చేయవచ్చు. అయితే సరైన కారణాలు చూపించి జగన్ బెయిల్ రద్దు అయ్యేలా అడగాల్సి ఉంటుంది. సీబీఐ అయితే కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంతకు మించి కేంద్రం వద్ద జగన్ కేసుల వ్యవహారం అయితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే నారాయణ మాత్రం కేంద్రం జోక్యం అవసరం అంటున్నారు. మరి ఆయన చేస్తున్న ఈ కామెంట్స్ అటు కూటమిలో ఇటు వైసీపీలో మరో వైపు బీజేపీలో చర్చకు తావిస్తున్నాయి.