జనసేన పొలిటికల్ పార్టీ.. నారాయణ గారూ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. ఆయనేమీ పిలవని పేరంటానికి వెళ్లలేదు. బీజేపీ పెద్దలే పవన్‌నుపట్టుబట్టి రావాలని లిఖిత పూర్వకంగా ఆహ్వా నిస్తేనే వెళ్లారు. అయితే.. దీనిని సీపీఐ సీనియర్ నాయకుడు, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తప్పుబట్టారు. పవన్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. బీజేపీకి మద్దతు పలికితే.. దేశం నాశనం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని తీర్మానం చేసినట్టు చెప్పుకొచ్చారు.
అయితే, నారాయణ చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. `జనసేన రాజకీయ పార్టీ నారాయణగారూ. ముందు మీరు ఈ విషయాన్ని గుర్తించాలి`` అని చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ముక్త ఏపీకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. అందివచ్చిన అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటున్నారని.. రాజకీయంగా దీనిని చూడాలే తప్ప.. వ్యక్తిగతంగా లేనిపోని వ్యాఖ్యలు అంటగట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
``గతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు నుంచి బయటకు వచ్చారు. అప్పట్లో వారు ఇకపై మేం కాంగ్రెస్‌తో అంటకాగం అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చెబుతున్నారు?`` అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ``మీరు ఏ ప్రజాస్వామ్యం బద్దలవకూడదని.. ఏ ప్రజాస్వామ్యం ధ్వంసం కాకూడదని చేతులు విదించుకుని వచ్చేసిన చేయి పార్టీతో మళ్లీ కలవగా లేంది.. ఇప్పుడు జనసేన తన దారిలో తాను వెళ్తే తప్పేంది?`` అని నిలదీస్తున్నారు.
మరికొందరు నాయకులు అక్కడితో కూడా ఆగకుండా.. నేరుగా కమ్యూనిస్టులపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ``సిద్ధాంతా లు సిద్ధాంతాలు.. అంటూ.. మీరు చేస్తున్నది ఏమిటి? దేశంలో ఎంత వరకు మీకు డ్యామేజీ అవుతోందో తెలియదా? ఇప్పుడు సిద్ధాంతాలే కాదు.. ప్రజలకోసం కొన్ని సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగానే జనసేన అడుగులు వేస్తోంది. దీనిని మీ వంటి పెద్ద నేతలు.. తప్పుబడితే ఎలా నారాయణ గారూ? మమ్మల్ని కూడా బావిలో కప్పల్లా బతికేయాలని మీరు కోరుకుంటున్నారా?`` అని నిలదీస్తున్నారు. అంతిమంగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా.. నారాయణ గారూ!! అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి కామ్రెడ్ బ్రో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.