శభాష్ లోకేశ్.. వైసీపీ నేత మేకపాటి ప్రశంసలు!

వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి అతిపెద్ద మద్దతుదారైన మేకపాటి తన రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసల్లో ముంచెత్తడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊహించలేదు.

Update: 2025-02-18 12:01 GMT

ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకుంటే ఆ కిక్కే వేరు.. అలాంటి ప్రశంసలు అందుకున్న మంత్రి నారా లోకేశ్ ఆ కిక్కు అనుభవిస్తున్నారో? లేదో? కానీ ఆయన అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహనరెడ్డి మంత్రి లోకేశ్ ను అభినందించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ అవుతున్న ఆ వీడియోలో మంత్రి లోకేశ్ భుజం తట్టి శభాష్ అంటూ రాజమోహనరెడ్డి అభినందించారు. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి అతిపెద్ద మద్దతుదారైన మేకపాటి తన రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసల్లో ముంచెత్తడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊహించలేదు. దీంతో ఆ వీడియో క్లిప్ అత్యంత ఆకర్షణగా నిలుస్తోంది.

నెల్లూరుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వైసీపీలో టాప్ లీడర్. ఆ పార్టీ అవిర్భావం నుంచి మేకపాటి కుటుంబం అధినేత జగన్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అయితే వయోభారం వల్ల ఆయన గతంలో వలే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. కానీ ఆయన కుటుంబం వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తోంది.

ఇదేసమయంలో రాష్ట్రంలో వైసీపీ-టీడీపీ మధ్య రాజకీయం సెగలు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా వైసీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో టీడీపీ నేతలతో వైసీపీ నేతలు అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఏదైనా కార్యక్రమంలో ఎదురుపడినా పలకరించుకోలేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అయితే ఈ రాజకీయ వైరానికి రాజమోహనరెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు.

నెల్లూరులోని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ తోపాటు సీనియర్ నేత రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమయంలో రాజమోహనరెడ్డికి ఎదురుపడిన లోకేశ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. భుజం తట్టి ఆయన విజయన్ని కొనియాడారు. శభాష్ లోకేశ్ టీడీపీకి అతిపెద్ద విజయం అందించవంటూ పెద్దాయన తన మనసులో మాటను బయటపెట్టి లోకేశ్ నాయకత్వ సామర్థ్యాన్ని చాటిచెప్పడం టీడీపీలోనూ చర్చకు దారితీసింది.

23 స్థానాల నుంచి 135 స్థానాలు గెలుచుకునేలా టీడీపీ ఎదగడానికి లోకేశ్ ప్రధాన కారణమంటూ రాజమోహనరెడ్డి అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలకు ముందు లోకేశ్ చేసిన పాదయాత్ర వల్లే టీడీపీ ఘన విజయం అందుకుందని, ఆ పాదయాత్రతో లోకేశ్ తన నాయకత్వ సామర్థ్యాన్ని ఆవిష్కరించారని అంటున్నారు. మొత్తానికి ప్రత్యర్థి నేత నుంచి ప్రశంసలు అందుకోవడంతో లోకేశ్ గ్రేట్ అంటూ టీడీపీ సోషల్ మీడియా సంబరాలు చేస్తోంది.

Tags:    

Similar News