ఔనా.. నిజమా.. ఢిల్లీలో రైతులు ఇలా చేస్తున్నారా?
ఈ క్రమంలో గత ఐదు రోజులుగా ఢిల్లీ వీధుల్లో వారు నిరసన, ఆందోళన చేస్తున్నారు. అక్కడే వండుకుని తింటున్నారు.
ప్రస్తుతం మూడు ప్రధాన రాష్ట్రాలకు చెందిన రైతులు.. ఢిల్లీలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. తమ పంటలకు ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేది వారి డిమాండ్‌గా ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కూడా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా ఢిల్లీ వీధుల్లో వారు నిరసన, ఆందోళన చేస్తున్నారు. అక్కడే వండుకుని తింటున్నారు. అక్కడే రోడ్లపై తీవ్రమైన చలిగాలుల మధ్యే నిద్రిస్తున్నారు.
పోలీసుల బలప్రయోగాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈక్రమంలో సోనిక్ ఆయుధాల కారణంగా.. పదుల సంఖ్యలో రైతులు వినికిడి శక్తిని కోల్పోయారు. మరికొందరు.. రైతులు భాష్ప వాయు ప్రయోగం కారణంగా కంటి చూపును కోల్పోయారు. ఇక పెల్లట్ల దాడిలో రైతుల ఒళ్లు హూనమైంది. ఇన్ని కళ్లకు కడుతున్న ఈ సమయంలో హఠాత్తుగా గత రెండు రోజుల నుంచి రైతులకు సంబంధించిన కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని ఆడియోలు కూడా తెరమీదకి వచ్చాయి.
వాటిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గించాలని ఆయనను గద్దె దింపాలని ఉండడం దేశవ్యాప్తం గా కలకలం రేపింది. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారా? లేక.. రాజకీయాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. రైతులు మద్యం కోసం ఓ వాహనం ముందు ఎగబడడం.. వారికి ఓ వ్యక్తి రాయల్ స్టాగ్ మద్యాన్ని గ్లాసులు, పళ్లాల్లో పోస్తుండడం.. ఇంకా కొంచెం.. ఇంకా కొంచెం.. అంటూ రైతులు నినదించడం వీడియో లో స్పష్టంగా కనిపిస్తోంది.
వీరంతా రైతులేనని, ఉద్యమం నకిలీదని.. కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇది ఎంత వరకు నిజం..? వాస్తవంగా.. ఇది జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా సీరియస్ ఉద్యమంలో ఇలాంటివి నిజమైతే.. రైతుల విశ్వసనీయతపైనే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.