ఇదేంది ధర్మాన? మహిళల్ని పట్టుకొని 'జడ్డి మాలోకం' అనేయటమా?
శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో అసరా సంబరాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పెరిగిన వయస ప్రభావం ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. చిన్న వాటికే చిరాకు పడిపోవటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఆయనకో అలవాటుగా మారింది. మాటల్లో మహిళలకు మర్యాద అంటూ ఉపన్యాసాలు దంచేసే ధర్మాన.. ఆ పని మాత్రం అస్సలు చేయరన్న పేరుంది. ప్రతి చిన్న విషయానికి అసహనపడిపోతూ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కేశారు.
శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో అసరా సంబరాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని ఆయన వివరిస్తున్నారు.
ఇలాంటివేళ.. కొందరు మహిళలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. తాను మాట్లాడే వేళలో.. అందరూ శ్రద్ధగా వినాలే తప్పించి.. మాట్లాడుకోవటం ఏమిటన్న ఆగ్రహానికి గురైన ఆయన.. ఆ కోపాన్ని తన మాటలతో మహిళల మీద ప్రదర్శించారు.
"ఏయ్ జడ్డి మాలోకం. చెప్పేది వింటున్నావా? ఇంత దూరం వచ్చారు. ఏం వింటున్నారు. ఇది మీ కుటుంబానికి సంబంధించిన సమస్య అని తెలుసుకోండి. ఒకసారి ఓటు వేస్తే ఐదేళ్లు ఏం జరిగిందో చూశారు. అందరూ ఇళ్లల్లో దర్జాగా బతుకుతున్నారు. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు పిచ్చివారిలా ఉండకూడదు. ఇది ప్రభుత్వాన్ని ఎన్నుకునే నిర్ణయం.
వాలంటీరు వ్యవస్థ ఉండాలంటే వైసీపీకే మద్దతు ఇవ్వాలి" అంటూ క్లాస్ పీకారు. ఆడవాళ్లకు ఇళ్లలో గౌరవం ఉండాలనే అన్ని కార్యక్రమాలకు వారి పేరు మీద అమలుచేస్తున్నట్లు చెప్పిన ధర్మాన.. తన మాటల్లో మాత్రం మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.