రాజ్యసభ సీటు.. నాగబాబు క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
ఈ నేపథ్యంలో... జనసేన నేత కొణిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోందని
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్య సభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ.. కూటమి పార్టీలు ఆ మూడు స్థానాలూ ఎలా పంచుకోబోతున్నాయనే.. ఎవరిని ఎన్నుకోబోతున్నాయనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... జనసేన నేత కొణిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోందని.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని.. ఖళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరగా, అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటనే ఆలస్యం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం హస్తిన పర్యటనలో ఉండగా ఈ తరహా కథనాలు వెల్లివెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్స్ లో ఓ పోస్ట్ వెలిసింది. ఈ పోస్టును గమనిస్తే అది.. పవన్ ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ టిక్కెట్ అంశం ఒకటనే చర్చకు సమాధానంగా ఉన్నట్లు అనిపిస్తుందని అంటున్నారు.
ఈ సందర్భంగా ఎక్స్ లో నాగబాబు చేసిన పోస్టు ఈ విధంగా ఉంది. "అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు.. అతని ప్రతి పనీ ప్రజా శ్రేయస్సు కోసమే.. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు" అని నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... "ఢిల్లీ వెళ్లిన ప్రయోజనం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు.. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. అలాంటి నాయకుడి కోసం నా జీవితాన్ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.. మా నాయకుడికి సేవ చేయడం కంటే నాకు ఇతర రాజకీయ లక్ష్యాలు ఏమీ లేవు" అంటూ నాగబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.
కాగా... ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. దీంతో... కూటమి పార్టీల మధ్య రాజ్యసభ హీట్ రాజుకుందని అంటున్నారు. ఈ మూడు స్థానాల్లోనూ ఒకటి టీడీపీ, మరొకటి జనసేనకూ ఖరారవ్వగా... మూడో సీటు కోసం బీజేపీ-టీడీపీ మధ్య పోటీ నెలకొందని అంటున్నారు.