మోడీని సనాతన ధర్మ బోర్డు గురించి పవన్ అడిగారా ?

హిందూ దేవాలయాల పరిరక్షణ అదే విధంగా హిందువుల హక్కుల మీద మోడీతో మాట్లాడారా అన్నది కూడా అందరిలో కలిగే సందేహం.

Update: 2024-10-19 00:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఈ మధ్యన భారీ ప్రకటనలే చేశారు. సనాతన ధర్మానికి విఘాతం కలుగుతోందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న దాని మీద పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.

ఫలితంగా ఆయన ఏకంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేశారు. ఇక దీక్ష విరమించిన అనంతరం తిరుపతి వేదికగా వారాహి డిక్లరేషన్ ని రిలీజ్ చేశారు. ఆ డిక్లరేషన్ లో సనాతన ధర్మ బోర్డుని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. అంతే కాదు రాష్ట్రాల స్థాయిలో అలాంటి బోర్డులు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

సనాతన ధర్మానికి విఘాతం కలిగితే ఈ బోర్డులు తగిన చర్యలకు సిఫార్సు చేస్తాయని అలా వాటికి చట్టబద్ధత ఉండేలా చూడాలని ఆయన కోరారు. పవన్ అక్టోబర్ 3న వారాహీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పటికి పదిహేను రోజులు అయింది. ఆ తరువాత ఆయన ధవళ వస్త్రాలు ధరించి తన పనిలో తాను అన్నట్లుగా ఉన్నారు.

అయితే పవన్ డిమాండ్ చేసిన సనాతన ధర్మం మీద పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పవన్ ఎన్డీయేలో కీలక భాగస్వామి పైపెచ్చు ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు కాబట్టి కచ్చితంగా ఆయన చేసిన డిమాండ్లు నెరవేరే చాన్స్ ఉంటుందని అంతా భావించారు.

అయితే పవన్ ఈ విషయం ఇపుడు ప్రస్తావించడం లేదు. ఆయన ఆవేశంతో ప్రకటనలు చేస్తారు ఆనక వాటి గురించి ఊసు ఎత్తరు అన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి ఉండనే ఉన్నాయి. మరి అన్నింటి మాదిరిగానే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ కూడా ఉందా అన్న మాట ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ హర్యానా ముఖ్యమంత్రి నైనీ ప్రమాణ స్వీఎకార కార్యక్రమంలో పాల్గొనేందుకు చండీఘర్ వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీతో ఆయన కరచాలనం చేసి మాట్లాడిన ఫోటోలు కూడా వచ్చాయి. మరి ఈ సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి పవన్ చెప్పి ఉంటారా అన్న చర్చ అయితే సాగుతోంది.

హిందూ దేవాలయాల పరిరక్షణ అదే విధంగా హిందువుల హక్కుల మీద మోడీతో మాట్లాడారా అన్నది కూడా అందరిలో కలిగే సందేహం. ఇక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ప్రధాని చెవిన వేశారా అన్నది మరో పాయింట్. కేంద్రంలో హిందూత్వకు ప్రాణం పెట్టే బీజేపీ అధికారంలో ఉంది.

పైగా మోడీకి ఈ విషయాలు చెప్పేటంత చనువు అయితే పవన్ కి ఉంది. ఆయన కనుక చెప్పి ఉంటే కేంద్రం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని కూడా అంటున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు హిందూ సంస్థల నుంచి మఠాలు పీఠాధిపతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది.

హిందువుల హక్కులను కాపాడే విధంగా అదే విధంగా దేవాలయాలలో హిందూ ధర్మం పరిరక్షణ జరిగే విధంగా రాజ్యాంగ బద్ధంగా చట్టబద్ధంగా ఒక సంస్థ సమ్ష ఉండాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే రాజకీయ పార్టీలు వీటిని ఎపుడూ పట్టించుకోలేదు. కానీ జనసేన అధినేత పవన్ నోటి నుంచి ఈ డిమాండ్ రావడంతో అది సాకారం అవుతుందని అంతా అనుకున్నారు.

మరి పవన్ ఈ విషయంలో ఏమైనా ప్రధానితో చర్చించి ఉంటే కనుక ఈ ఇష్యూ ముందుకు కదులుతుందని అంతా అంటున్నారు. చూడాలి రానున్న కాలంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ఉంటుందో లేదో. ఏది ఏమైనా పవన్ తాను ఆవేశంతో చేసిన ప్రకటనలను ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్తేనే ఆయన మాటకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే సీరియస్ నెస్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News