డీకేతో కేసీఆర్ కు షాక్?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అందుకు అవసరమైన వ్యూహాలు, కసరత్తుల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ జోరును అడ్డుకుని, కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంటు కేసీఆర్ ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అయితే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్.. తెలంగాణ ఎన్నికల కోసం డీకే శివకుమార్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమైందని తెలిసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంతో డీకే శివకుమార్ పేరు మార్మోగిపోయింది. ఆశలు లేని కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపించడంతో ఆయనలోని సామర్థ్యాలు, వ్యూహ చతురత బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో డీకే శివకుమార్ కీలక నాయకుడిగా ఎదిగిపోయారు. ఇప్పుడు దక్షిణ భారత్ లో కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోని జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన్ని కలిసేందుకు బెంగళూరుకు వరుస కడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను బరిలో దించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో లెక్కలు మార్చేందుకు ఆయన హైదరాబాద్ రాబోతున్నారని సమాచారం. నెల రోజుల పాటు ఇక్కడే ఉండి.. ఎన్నికల్లో పార్టీని నడిపిస్తారని తెలిసింది. కాంగ్రెస్ విజయం కోసం వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తారని టాక్. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ప్రస్తుత పరిణామాలపై వీళ్లు చర్చించారని తెలిసింది. ఇప్పుడు కర్ణాటక మాదిరే తెలంగాణలోనూ డీకే శివకుమార్ పార్టీని గెలిపిస్తారని హైకమాండ్ ఆశలు పెట్టుకుందని సమాచారం.