సృజ‌నాత్మ‌క‌తే పెట్టుబ‌డి.. యూట్యూబ్ వేదిక‌గా కోట్ల రాబ‌డి!

దేశం లో 2 కోట్ల మంది అచ్చంగా యూట్యూబ్ ఆదాయాన్ని పెంచుకోవ‌డం.. వాటిపైనే జీవిస్తున్న‌ట్టు ఈ స‌ర్వే పేర్కొంది.

Update: 2024-04-08 03:45 GMT

''నే ఆడితే లోక‌మే ఆడ‌దా!''- అని ఓ సినిమాలో పాట గుర్తుందా? ఇప్పుడు ఇది నిజ‌మే అవుతోంది. స‌మ‌యం-సృజ‌నాత్మ‌క‌త ల పెట్టుబ‌డితో యూట్యూబ్ వేదిక‌గా రూ.కోట్లు సంపాయిస్తున్న వ్య‌క్తులు దేశంలో పెరుగుతున్నారు. తాజాగా కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన స‌ర్వేలో భార‌త దేశం.. ప్ర‌పంచ వ్యాప్తంగా యూట్యూబ్ చానెళ్ల వినియోగం.. ఆదాయంలో ముందుండ‌డం విశేషం. దేశం లో 2 కోట్ల మంది అచ్చంగా యూట్యూబ్ ఆదాయాన్ని పెంచుకోవ‌డం.. వాటిపైనే జీవిస్తున్న‌ట్టు ఈ స‌ర్వే పేర్కొంది. దీనిలో ఉత్త‌రాది, ద‌క్షిణాది రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.

ప‌రిధులు లేని పేరుకూడా!

యూట్యూబ్ ద్వారా రెండు ర‌కాలుగా ల‌బ్ధి చేకూరుతోంది. సాదార‌ణంగా ఏప‌ని చేసే వారికైనా పేరు కూడా రావాల‌ని కోరుకుంటా రు. డ‌బ్బుతోపాటు పేరును కాంక్షించేవారు లేని స‌మాజం, సంస్థ ఉండ‌దు. అయితే.. ఈ క్ర‌మంలో డ‌బ్బు వ‌చ్చినా పేరు వ‌స్తుందో రాదో చెప్ప‌డం క‌ష్టం. అయితే.. చిన్న ప్ర‌య‌త్నం, ప్ర‌యోగంతో డ‌బ్బుతో పాటు ఎన‌లేని పేరును కూడా తీసుకువ స్తోంది యూ ట్యూబ్. దీనిలో పెట్టుబ‌డి ఏమీ ఉండ‌దు. కొద్ది మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరిగే వ‌ర‌కు కాసింత ఓపిగా, ఓర్పుగా.. వీడియోలు చేయ‌డ‌మే దీనిలో కిటుకు. వ‌న్స్ ఇది క్లిక్క‌యితే.. ఇది తిరిగి చూసుకోన‌క్క‌ర్లేదు. దీనిలో సీనియ‌ర్లు.. జూనియ‌ర్లు.. అనే మాటేలేదు.

అంతేకాదు.. విష‌యం ఇలా ఉండాలి.. అలా ఉండాల‌న్న నియ‌మం లేదు. ఎంచుకున్న స‌బ్జెక్ట్ ప‌స లేనిదైనా.. సృజ‌నాత్మ‌క‌త‌ను, మాట‌ల అల్లిక‌ల‌ను పేర్చి.. వీక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తే అదే `మంత్ర‌దండం`... కాసులతోపాటు పేరును కూడా తీసుకువ‌చ్చే.. క‌ల్ప‌త‌రువు. తాజాగా యూట్యూబ్ ద్వారా ల‌క్ష‌లు సంపాయిస్తున్న వారిని ప‌క్క‌న పెడితే(వీరి సంఖ్య కోట్ల‌లో ఉంది) రూ.కోట్లు సంపాయిస్తున్న‌వారి పేర్లు తాజాగా తెర‌మీదికి వ‌చ్చాయి. పైన చెప్పుకొన్న‌ట్టుగా వీరు తొలినాళ్ల‌లో కొంత శ్ర‌మించినా.. అన‌తి కాలంలోనే వీక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. దేశ స‌రిహ‌ద్దులు దాటేసి మ‌రీ.. వీరు ప్రాచుర్యంతోపాటు.. రూపాయ‌ల‌ను కూడా గ‌డిస్తున్నారు.

ఒక్కొక్క‌రిది ఒక్కొక్క బాణీ!

+ యూట్యూబ్‌లో కోట్లు గ‌డిస్తున్న వారిలో ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క బాణీ. ‘క్యారీమినాటీ’ చానెల్ ద్వారా అజయ్‌ నాగర్ నాలుగు కోట్ల మందిని స‌బ‌స్క్రైబ‌ర్లుగా పొదారు. హరియాణాకు చెంది అజయ్‌... క్యామిడీతోపాటు వీడియో గేములతో మూడు ఛానళ్లు నడుపుతున్నాడు. రూ.50 కోట్లు సంపాయిస్తున్నాడు.

+ మహారాష్ట్రకు చెందిన ఆశిష్‌ చంచ్లానీ ‘ఆశిష్‌ చంచ్లానీ వైన్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్ న‌డుతున్నాడు. తమాషా మాటలతో నవ్వు పుట్టించే కాన్సెప్ట్‌లతో అలరిస్తూ 3 కోట్ల 30 లక్షల మంది స‌బ్ స్కైబ‌ర్ల‌ను సంపాయించాడు. రూ.41 కోట్లు సంపాయిస్తున్నాడు.

+ ఢిల్లీకి చెందిన భువన్‌ 2015లో షార్ట్‌ కామెడీ వీడియోలతో ఛానల్‌ను మొదలుపెట్టి రెండున్నరకోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. 30 ఏళ్ల భువన్‌ సంపాదన రూ.122 కోట్లు.

+ రాజస్థాన్‌లోని అజ్మేర్‌కి చెందిన గౌరవ్‌ చౌధురి టెక్నాలజీపైన పట్టుసాధించి 2015లో సొంతంగా ఛానల్‌ పెట్టాడు. దాదాపు రెండున్నర కోట్ల చందాదారుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు రూ.350 కోట్లకుపైనే సంపాయించాడు. ఇత‌నే దేశంలో టాప్ ఎర్న‌ర్ అంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.

+ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిశామధులిక వ‌య‌సు 64 ఏళ్లు. ఈ వ‌య‌సులో ఏం చేస్తామ‌ని ఆమె కాళ్లు ముడుచుకోలేదు. యూట్యూబ్‌లో త‌న వంట‌ల‌తో ఘుమ‌ఘుమ‌లాడిస్తున్నారు. 43 కోట్ల రూపాయల ఆదాయంతో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News