కక్ష సాధింపా.. అవినీతిపై పోరాటమా?

లోక్‌ సభ ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బకొట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చెలరేగుతున్నాయి.

Update: 2024-03-22 05:57 GMT

లోక్‌ సభ ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బకొట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను (ఐటీ) శాఖ స్తంభింపచేయడం, మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలయిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ను మద్యం కుంభకోణంలో అరెస్టు చేయడం ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం ఎప్పుడో బయటపడ్డా.. ఇన్నాళ్లూ పట్టించుకోనట్టుగా ఉండి.. ఎన్నికల ముందు ఆయా పార్టీల్లో పెద్ద తలకాయలను అరెస్టు చేయడాన్ని బీజేపీ ఎత్తుగడగా భావిస్తున్నారు. తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రచారం చేయకుండా చేతులు కట్టేయడం, ఆయన నైతిక స్థైర్యాని దెబ్బకొట్టడం, ఆయన పార్టీకి చెందిన నేతలను బీజేపీలోకి చేర్చుకోవడమే కవిత అరెస్టు లక్ష్యమంటున్నారు.

అదేవిధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ, పంజాబ్‌ ల్లో అధికారంలో ఉంది. అంతేకాకుండా హరియాణా, గుజరాత్‌ ల్లోనూ బాగానే విస్తరించింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పంజాబ్‌ లో అన్ని స్థానాల్లో ఆప్‌ పోటీ చేస్తోంది. ఢిల్లీ, హరియాణా, గుజరాత్‌ ల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. ఈసారి ఆప్‌ ఈ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఆప్‌ కు ప్రధాన నేత ఇప్పటికీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక్కరే. ఆయనను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి నెంబర్‌ టూ అనదగ్గ నేతలెవరూ లేరు. గతంలో మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ వంటి వారు ఉండేవారు. అయితే వారిద్దరూ ఇప్పటికే జైలుపాలయ్యారు. జైల్లోనే ఉన్నారు. దీంతో ఆప్‌ రెక్కలు తెగిన పక్షిలా మారింది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న విరాళాల్లో లెక్కలు లేవని, ఆదాయపన్ను (ఐటీ) కట్టలేదని ఐటీ శాఖ కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. దీంతో తాము దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడానికి తమ వద్ద డబ్బుల్లేవని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నిర్వేదం వ్యక్తం చేశారు. కనీసం రైలు టికెట్లు కూడా బుక్‌ చేయలేని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. రూ.2 కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామని సాక్షాత్తూ సోనియాగాంధీ వాపోయారు. ఎన్నికల ముందు తమను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జేబు సంస్థలుగా మారాయిని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్టే ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. కేవలం ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుంటూ ఎన్డీయే కూటమిలోని నేతల జోలికి వెళ్లడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో ఎక్కడ చూసినా సీబీఐ, ఈడీ వేధింపులు ఎక్కువయ్యాయని టాక్‌ నడుస్తోంది. మరోవైపు పక్కా ఆధారాలతోనే ఈడీ, సీబీఐ నిందితులను అరెస్టు చేస్తున్నాయని అంటున్నారు. అరెస్టు అయిన నేతలకు కోర్టుల్లో సైతం ఊరడింపు దక్కడం లేదని, అవినీతికి ఆధారాలుండటం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. ఇందుకు కేసీఆర్‌ కూతురు కవిత ఉదంతమే నిదర్శనమని చెబుతున్నారు.

ఇంకోవైపు కేజ్రీవాల్‌ రూ.100 కోట్లకు లొంగుతాడా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇది గ్యారెంటీగా కక్ష సాధింపు అని ఆరోపిస్తున్నారు. కవిత మీద చాలా ఆరోపణలు ఉన్నాయని.. అయితే కేజ్రీవాల్, మనీష్‌ సిసోడియాలపైన చాలా తక్కువ సందేహాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఖచ్చితంగా లోక్‌ సభ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడ్డాక ఈ అరెస్టులు జరుగుతుండటంతో ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బతీసే లక్ష్యం, మిగతా నేతలను భయపెట్టే ఉద్దేశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News