ఎన్నికల వేళ బ్యాంక్ ఖాతాలకు రూ.లక్ష తిప్పలు
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ ధన ప్రభావం తీవ్రంగా ఉండటంతో సరికొత్త పద్దతులతో క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల నుంచి రూ.లక్ష.. అంతకు మించి చేపట్టే లావాదేవీలపై నిఘా పెట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
దీంతో.. బ్యాంకు ఖాతాలకు సంబంధించి చేపట్టే లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ ఖాతాల నుంచి విత్ డ్రా చేసినా.. డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాల్నివెల్లడించాలని ఆదేశించింది. ఎన్నికల వేళ డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వేసినా.. డబ్బులు తీసినా అప్రమత్తంగా ఉండాల్సిందే.
రూ.లక్ష.. అంతకుమించి లావాదేవీలు జరిగే ప్రతి ఖాతాను పరిశీలించటం.. వాటి వివరాల్ని సేకరించటం.. క్రాస్ చెక్ చేయటం ఎన్నికల అధికారులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల వేళలో ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు సొమ్ములు బదిలీ అవుతున్నాయన్న కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యను చేపట్టారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ఖాతాలు.. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి ఖాతాలపై మరింత నిఘా పెట్టాలని బ్యాంకు అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇక.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి భార్య.. అభ్యర్థిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఎన్నికల వేళలో రూ.లక్ష కంటే ఎక్కువ లావాదేవీల్ని నిర్వహించి ఉంటే.. ఆ వివరాల్ని అభ్యర్థులు తమ అఫిడవిట్ లో పేర్కొనాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటానికి రెండు నెలల ముందు నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఈసీ కోరింది. రూ.10 లక్షలకు మించిన నగదు విత్ డ్రా చేసిన ఖాతాల మీద కూడా నిఘా పెట్టాలని నిర్ణయించారు. మొత్తంగా.. ఎన్నికల వేళ మీ బ్యాంక్ ఖాతాల నుంచి డిపాజిట్ చేసే వాటిపైనా.. విత్ డ్రా చేసే మొత్తాల మీద నిఘా కన్ను వేసి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.