రూ.2 వేల కోట్లు.. ట్రంప్ గెలుపుకు మస్క్ ఖర్చు చేసిన చిల్లర ఇది

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు విరాళాలు ఇవ్వడం సంప్రదాయం.

Update: 2024-12-06 09:25 GMT

కొన్నిసార్లు ఎన్నికల్లో గెలుపు శకునం ముందే కనిపిస్తుంది.. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం అనికూడా ఇలానే కనిపించింది. మరీ ముఖ్యంగా అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్రంప్ నకు మద్దతు ప్రకటించారో అప్పటినుంచే ట్రంప్ దే అధ్యక్ష పీఠం అని స్పష్టమైంది.

భూరి విరాళం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులకు విరాళాలు ఇవ్వడం సంప్రదాయం. ఇలానే ట్రంప్ తో పాటు, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ విరాళాలు సేకరించారు. అయితే, ట్రంప్ కోసం విరాళాలకు తోడు ప్రచారం కూడా చేశారు మస్క్. ట్రంప్ తో కలిసే కాదు.. సొంతంగానూ ప్రచారానికి వెళ్లారు.

వందలు కాదు వేలకోట్లు

వాస్తవానికి ట్రంపే అపర కుబేరుడు. అలాంటివాడికి మస్క్ లాంటి మహా అపర కుబేరుడు తోడైతే..? ఇంతకూ ట్రంప్ నకు మస్క్ ఎన్నికల ఖర్చు కింద ఎంత ఇచ్చి ఉంటాడు? ఇలాంటి పలు ప్రశ్నలు అందరిలోనూ మెదిలాయి. వాస్తవానికి మొదట్లో మస్క్..రూ. 400 కోట్లు ఇచ్చారనే కథనా వచ్చాయి. కానీ, ఇప్పుడు అసలు లెక్క తేలింది. విరాళం కాదు కానీ.. మస్క్ మొత్తమ్మీద 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది రూ.2 వేల కోట్లు. అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఫైలింగ్‌ ఈ విషయం వెల్లడించింది.

అక్కడా ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీ

ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలను అమెరికాలోని పొలిటికల్ యాక్షన్‌ కమిటీ (ప్యాక్) నిర్వహించింది. దీనికి ట్రంప్ 239 మిలియన్‌ డాలర్లను నగదుగా.. మరికొంత ఇతర రూపాల్లో ఇచ్చారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రూత్ బాడర్‌ గిన్స్బర్గ్ పేరు మీద మరో 20 మిలియన్ డాలర్లు అందించారు.

స్వయంగా ప్రచారం..

ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ.. తన ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ ట్రంప్ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు మస్క్. విరాళాలు ఇవ్వడమే కాదు.. ఆయనతో కలిసి, సొంతంగా ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లు ట్రంప్‌ వైపు మళ్లేలా వాక్‌ స్వాతంత్ర్యం, తుపాకీ హక్కులపై రూపొందించిన పిటిషన్‌ పై సంతకాలు చేస్తే మస్క్ డబ్బులు పంచారనే కథనాలు వచ్చాయి.

మస్క్ మంత్రి అవుతారా?

గెలిస్తే మస్క్ ను మంత్రిని చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌ మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) పగ్గాలు అప్పజెప్పారు. అయితే, ఇందులో భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి కూడా ఉన్నారు.

Tags:    

Similar News