ఒక ఇంజినీర్ లాగిన్ ఇష్యూ.. 7 లక్షల మందికి చుక్కలు
సమస్య పరిష్కారానికి గంటల కొద్దీ టైం తీసుకోవటంతో ఏకంగా ఏడు లక్షల మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
అవును.. ఒక్క ఇంజినీర్ లాగిన్ సమస్య దాదాపు 7 లక్షల మందికి ఇక్కట్లుకు తెచ్చి పెట్టటమే కాదు.. ఏకంగా 126 మిలియన్ డాలర్ల (సుమారుగా 1.06వేల కోట్లు) భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇటీవల కాలంలో ఇలాంటివేమీ బ్రేకింగ్ న్యూస్ గా చూడలేదు.. వినలేదనుకుంటున్నారా? అవును. మీరు కరెక్టే. గత ఏడాది జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా నివేదిక బయటకు వచ్చింది. కాస్త వెనక్కి వెళితే.. గత ఏడాది ఆగస్టులో బ్రిటన్ లో చోటు చేసుకున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని సాంకేతిక లోపం ఆ దేశంలోని వేలాది విమానాల మీద పడటమే కాదు.. విమాన సర్వీసులకు తీవ్రమైన అంతరాయాన్ని కలిగించింది.
అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లోపం ఎక్కడ చోటు చేసుకుంది? దీని బాధ్యులు ఎవరు? భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి తలెత్తకుండా చూసేందుకు ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చేపట్టిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. గత ఆగస్టు 28న బ్రిటన్ లో సెలవు దినం. అదే రోజు విమాన సర్వీసులకు తీవ్రంగా అంతరాయం చోటు చేసుకోవటంతో దేశ వ్యాప్తంగా పలు విమానాలు ఆలస్యమయ్యాయి. పెద్ద ఎత్తున విమానాలు రన్ వే కే పరిమితం అయ్యాయి.
సమస్య పరిష్కారానికి గంటల కొద్దీ టైం తీసుకోవటంతో ఏకంగా ఏడు లక్షల మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఈ అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. అసలు సమస్యంతా ఒక జూనియర్ ఇంజినీర్ లాగిన్ సమస్యను ఎదుర్కోవటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని తేల్చారు. అయితే.. ఈ విషయంలో అతడి పాత్ర పరిమితంగా ఉందని గుర్తించారు. అదే సమయంలో.. సెలవు వేళ.. సీనియర్ ఇంజినీర్లు వర్కు ఫ్రం హోం చేయటం కూడా ఈ సమస్యకు మరో కారణంగా తేల్చారు. సాంకేతిక సమస్య తలెత్తిన వేళ.. ఆఫీసులో ఉన్న జూనియర్ ఇంజినీర్ ఇష్యూను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.
ఎందుకిలా? అంటే.. వర్కు ఫ్రం హోంగా ఉన్న ఒక సీనియర్ ఇంజినీర్ లాగిన్ అయ్యేందుకు ట్రై చేయటం.. పాస్ వర్డు అథెంటికేషన్ సమస్య కారణంగా సిస్టమ్ ను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో.. హుటాహుటిన ఆఫీసుకు బయలుదేరి వచ్చేందుకు అతడికి 90 నిమిషాలకు పైనే టైం పట్టింది. అనంతరం ఇష్యూను పరిష్కరించేందుకు మరికొంత టైం పట్టింది. ఏకంగా ఈ ఎపిసోడ్ కారణంగా ఏడు లక్షల మంది ప్రయాణికులకు చుక్కలు కనిపించేలా చేయటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శల్ని.. భారీ మొత్తంలో పరిహారాన్ని అందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు విధానపరమైన సిఫార్సులను చేసింది ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ. వర్కు ఫ్రం హోం అవకాశం ఉన్నప్పటికీ కీలక సమయాల్లో సీనియర్ ఇంజినీర్లు ఆఫీసులోనే అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పింది. గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ ఇష్యూకు సంబంధించిన రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది.