ఈశాన్య రాష్ట్రంలో విపక్షానికే జనం మొగ్గు.. సీఎం కానున్న మాజీ ఐఏఎస్
తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 6 ఏళ్ల కిందట పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ కు ఇక్కడి ప్రజలు సీఎం సీటును అప్పగించారు.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది కేవలం నాలుగు రాష్ట్రాలే. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ. కానీ.. పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించని మరో రాష్ట్రం మిజోరాం. ఇది ఈశాన్య రాష్ట్రం. కేవలం 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితేనేం.. రాజకీయంగా ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుంది. పైగా ఇక్కడి ప్రజలు కూడా చాలా తెలివైన వారు.
అందుకే.. పనిచేసే పార్టీకి.. తమకు ధైర్యాన్నిచ్చే పార్టీకి.,. తమ పక్షాన నిలబడే పార్టీకి పట్టంకట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 6 ఏళ్ల కిందట పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ కు ఇక్కడి ప్రజలు సీఎం సీటును అప్పగించారు. ఆయనే లాల్ దుహోమా! ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. 2017లో ఆయన మిజోరాం పీపుల్స్ మూమెంట్(జెడ్పీఎం) పార్టీ ని స్థాపించారు. తదుపరి ఏడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. ఏకంగా 8 స్థానాలు కైవసం చేసుకున్నారు.
అలుపెరుగని శ్రమ, కృషి.. దూర దృష్టి.. రాష్ట్రం కోసం కేంద్రంతో అయినా పోరాడే తత్వం.. వంటివి లాల్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. ఫలితంగా... బలమైన అధికారపార్టీ ఎంఎన్‌పీ(మిజో నేషనలిస్ట్ పార్టీ)ని సైతం మట్టికరిపించి. మొత్తం 40 స్థానాల్లో 27 స్థానాలను దుహోమా తన బుట్టలో వేసుకున్నారు. అత్యంత సామాన్యంగా వ్యవహరించే ఈ మాజీ ఐఏఎస్ అధికారి.. ఈశాన్య రాష్ట్రంలోని అణువణువు తిరిగారు. పర్యావరణ ప్రేమికుడిగా పేరొందారు.
యాంటి హిందూ.. యాంటీ కమ్యూనిటీ నినాదాలు ఇక్కడ ఆయనకు బాగా కలిసి వచ్చాయి. అదేసమయం లో మణిపూర్ విషయంలో మోడీతో విభేదించి.. అక్కడి వారి తరఫున బలమైన వాదనలు వినిపించారు. పైగా క్రిస్టియన్ కమ్యూనిటీని ఎంతో ప్రేమించి లాల్.. వారికి అండగా ఉన్నారు. అందుకే.. తాజా ఎన్నికల్లో బలమైన ఎంఎన్‌పీని పక్కన పెట్టిన ప్రజలు కేవలం ఆరేళ్ల కిందట పార్టీ పెట్టిన లాల్‌ను అధికారంలోకి తెచ్చేశారు.