తప్పుడు వార్తలపై సర్కార్ సీరియస్.. క్రిమినల్ కేసులకు ఉత్తర్వులు?

Update: 2023-07-28 12:03 GMT

వార్తలు, కథనాలు, విశ్లేషణలు.. ఇవన్నీ అందరికీ తెలిసినవే. జరిగిన విషయంపై న్యూస్ రాస్తారు.. విశ్లేషణలో భాగంగా వ్యూస్ రాస్తారు.. మరికొంతమంది విశ్లేషకులు వారి అభిప్రాయాలు చెబుతుంటారు. అయితే తాజాగా వెలువడిన ఒక వార్త వీటన్నింటికీ భిన్నం! అది కల్పించిన వార్త.. పూర్తిగా కల్పిత కథ!!

అవును... మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే లోకంలో అన్నీ ఘోరాలు.. ఎక్కడ చూసినా అన్యాయాలు కనిపిస్తాయి. అదే మనకు తియ్యగా ఉన్న పార్టీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం మొత్తం రామరాజ్యంలా ఉంటుంది. నెలకు మూడు వర్షాలు.. ఏటా మూడేసి పంటలు.. ఇంటింటా నవ్వుల పరవళ్లు.. అసలు ఈ రాష్ట్రంలో కష్టం ఎక్కడా లేదా అని దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కథనాలు వండుతారు.

అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న మీడియా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదని అంటుంటారు. పైగా ఆ సమూహమంతటికీ కలిపి రాష్ట్ర ప్రజలు ఎల్లో మీడియా అని పేరు పెడితే... ఏపీ ముఖ్యమంత్రి వాటితో విపక్షాలను కలిపి దుష్టచతుష్టయం అని పేరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆ మీడియా అచ్చేసిన ఒక వార్త గురించి ప్రభుత్వం ఆరా తీసింది. విషయం తెలుసుకున్న జనాలు ముక్కున వేళేసుకుంటున్నారు!!

వివరాళ్లోకి వెళ్తే... గురువారం రెండు పసుపు మీడియా సంస్థలు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. "పైన గొడుగు - కింద మడుగు" అంటూ ఒక పసుపు పత్రిక.. "నమ్మండి - ఇది నిజంగా బడే" అంటూ మరో పసుపు పత్రిక ఒక వార్తని అచ్చేసి వదిలాయి!

దీంతో... దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్న చందంగా... కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకొంతమంది జనాలు ఆ వార్తలను తమ తమ సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసుకున్నారు. షేర్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతూ కామెంట్లు పెట్టారు!

దీంతో వాళ్ళను అలా వదిలితే బాగోదు అని భావించారో ఏమో కానీ... తాజాగా ప్రభుత్వం ఆ మీడియా సంస్థలు, ఆ వార్తలు రాసిన విలేకరుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తోంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి.. విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయా వార్తా సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

హవ్వ.. ఎంత దారుణానికి తెగబడ్డారు?:

వాస్తవానికి విస్సన్నపేట జడ్పి హైస్కుల్ ను రూ. 66 లక్షలతో "నాడు - నేడు" పథకంలో భాగంగా ఆధునీకరించారు. కొత్త బెంచీలు, పరిశుభ్రమైన టాయిలెట్లతో పాటు పరిశరాన్నంతా పచ్చదనంతో నింపారు. దీంతో స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది.

ఈ సమయంలో ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు. అవి అలానే ఉన్నాయి. పిల్లలు మాత్రం కొత్త భవనాల్లో విద్యనభ్యసిస్తున్నారు.

అయితే గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న వరుస వర్షాలకు ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు పత్రికా విలేకరులు, ఛానెల్ విలేకరులు కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి.. బలవంతాన కూర్చోబెట్టి.. వారి చేతికి గొడుగులు ఇచ్చి.. ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలిందని తెలుస్తోంది.

అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా.. ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు. వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుచేసే దురుద్దేశంతో వార్తలు సృష్టించారన్నమాట. ఇలా తప్పుడు వార్తలు ప్రజల్లోకి వెళ్లిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

దీంతో మరింత లోతైన విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన.. మీడియా సంస్థలతోపాటు, విలేకరులపైనా క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో... ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తోన్న పత్రికలను నిషేదించాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News