మంత్రి అనుచరుల అల్టిమేటం... తగ్గేదేలే అంటూ రైతులు కీలక నిర్ణయం!

ఓ వ్యక్తి నాయకుడు అయినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి అయినా దానికి కారణం ఓట్లేసిన ప్రజలే అనే విషయం చాలామంది నాయకులతో పాటు వారి అనుచరులు మరిచిపోతుంటారని చెబుతుంటారు.

Update: 2025-02-07 06:09 GMT

ఓ వ్యక్తి నాయకుడు అయినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి అయినా దానికి కారణం ఓట్లేసిన ప్రజలే అనే విషయం చాలామంది నాయకులతో పాటు వారి అనుచరులు మరిచిపోతుంటారని చెబుతుంటారు. అధికారం ఐదేళ్లే.. ప్రజలు నూరేళ్లు అని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా రైతుల అవసరాన్ని అర్ధం చేసుకోకుండా ఓ మంత్రి అనుచరులు చేసిన హడావిడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!

అవును... శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధి యోగి వేమన డ్యాం కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆయుకట్టు రైతులు సుమారు గత నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారట. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించిన అధికారులు.. సాగునీటి సంఘం ఛైర్మన్ తో కలిసి గురువారం నీరు విడుదల చేయడానికి ఉదయం డ్యాం వద్దకు చేరుకున్నారు.

ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇలా అధికారులు, సాగునీటి సంఘం ఛైర్మన్ తో కలిసి రైతులంతా నీరు విడుదల చేయించుకుంటున్నారనే విషయం మంత్రి సత్యకుమార్ అనుచరులకు తెలిసిందంట. దీంతో.. ఆయన ముఖ్య అనుచరుడిగా పేరున్న బీజేపీ నేత ఒకరు నేరుగా ఇరిగేషన్ జేఈకి ఫోన్ చేసి.. మంత్రి లేని సమయంలో నీరు ఎలా విడుదల చేస్తారంటూ కాస్త గట్టిగానే మాట్లాడినట్లు చెబుతున్నారు.

దీంతో... నీరు విడుదల చేయడానికి జేఈ నిరాకరించారు. ఈ సమయంలో డ్యాం వద్దకు చేరుకున్నారు ఇరిగేషన్ ఎస్.ఈ. ఈ సమయంలో మంత్రి సత్యకుమార్ కు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. మరోపక్క రైతులు తమ పరిస్థితిని అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. కాలువకు నీరు విడుదల కాకపోతే పంటలు ఎండిపోతాయని వాపోయారు.

అయినప్పటికీ.. మంత్రి అనుచరుల హుకుం మేరకో ఏమో కానీ అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి! ఉదయం 8 గంటలకు అన్న కార్యక్రమం కాస్త మధ్యాహ్నం 2 అవుతున్నా జరగలేదు. ఈ సమయంలో రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. 2 గంటల సమయంలో రైతులే గేట్లు ఎత్తి, కాలువకు నీరు విడుదల చేసుకున్నారు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

Tags:    

Similar News