మోడీ 3.0 కేబినెట్ లో కొలువు తీరిన ఫస్ట్ టైం ఎంపీలు

ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ కు నాలుగుసార్లు వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఎట్టకేలకు కేంద్ర మంత్రి అయ్యారు.

Update: 2024-06-10 17:30 GMT

ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి.. తొలిసారి విజయం సాధించిన వారు ఏకంగా మోడీ 3.0 కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి లక్కీ ఎంపీలు ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు ఉండటం ఆసక్తికరంగా మారింది. తొలిసారి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించినంతనే కేంద్ర మంత్రివర్గంలో కొలువు లభించటానికి మించిన లక్ ఇంకేం ఉంటుంది. అదే సమయంలో పలుమార్లు ఎంపీగా గెలిచినప్పటికీ మంత్రి పదవి రాని వారికి తొలిసారి దాన్ని సొంతం చేసుకున్న వారూ ఉన్నారు. మొదటిసారి గెలిచిన మంత్రులైన వారితో పాటు.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రి పదవిని సొంతం చేసుకున్న వీరి బ్యాక్ గ్రౌండ్ విశేషాల్ని చూస్తే..

ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ కు నాలుగుసార్లు వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఎట్టకేలకు కేంద్ర మంత్రి అయ్యారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసిన ఆయనకు కేబినెట్ లో కొలువు లభించింది. 1977లో సంఘ్ పరివార్ లో వాలంటీర్ గా చేసిన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో మాత్రం చోటు దక్కలేదు. అదే సమయంలో నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయనకు తాజాగా కేంద్ర మంత్రి పదవి దక్కలేదన్న కొరత తీరింది. తాజాగా మోడీ 3.0లో ఆయనకు కొలువు దక్కింది. మామగా అందరూ పిలిచే శివరాజ్.. తాజాగా కేంద్ర మంత్రి అయ్యారు.

మొత్తం 72 మంది మంత్రుల్లో 33 మందికి తొలిసారి మంత్రి పదవులు లభించాయి. ఇలాంటి వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. పలుమార్లు ఎంపీలుగా గెలిచినా దక్కని మంత్రి పదవులు తాజాగా దక్కాయి. అలాంటి వారిలో..

మనోహర్ ఖట్టర్

హెచ్ డీ కుమారస్వామి

లలన్ సింగ్

రామ్ నాథ్ ఠాకూర్

జయంత చౌదరి

చిరాగ్ పాస్వాన్

సురేష్ గోపి

రామ్మోహన్ నాయుడు

పెమ్మసాని చంద్రశేఖర్

బండి సంజయ్

శ్రీనివాసవర్మ తదితరులు ఉన్నారు.

మొత్తం మంత్రివర్గంలోకి 72 మందిని తీసుకున్నప్పటికీ వీరిలో 30 మంది మాత్రమే కేబినెట్ హోదా పొందారు. ఐదుగురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులు.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో గరిష్ఠంగా 81 మందికి చోటు కల్పించొచ్చు. అంటే.. మరో తొమ్మిది మందికి అవకాశం ఉంది.

కేరళ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన సినీ నటుడు సురేశ్ గోపీతో పాటు.. అదే రాష్ట్రానికి చెందిన క్రైస్తవ నేత కురియన్ కు మంత్రి పదవిని ఇవ్వటం విశేషం. నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న ఆయన ఎంపీగా గెలవనప్పటికీ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో.. ఆయన్నురాజ్యసభకు ఎంపిక చేయనున్నట్లుగా చెప్పాలి. పంజాబ్ లోని లూధియానా నుంచి ఇటీవల ఎన్నికల్లో ఓడిన రవీందర్ సింగ్ బిట్టూకు సైతం మంత్రి వర్గంలో చోటు కల్పించి ఆశ్చర్యానికి గురి చేశారు.

Tags:    

Similar News