ఇది కదా.. బాబుకు బ్యాడ్‌నేమ్!
దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అది టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. జిల్లా కూడా. ఏదైతే.. జరగకూడదని రెండు రోజులుగా వరుస పెట్టి నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారో.. అదే ఆ జిల్లాలోను, ఆ నియోజకవ ర్గంలోనూ జరిగింది. దీనివెనుక బలమైన నాయకులు, నియోజకవర్గాన్ని, జిల్లాను సైతం శాసించగల నాయకులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగింది?
రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారం నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటుకు కట్టబెట్టింది. తద్వారా సర్కారుకు బ్యాడ్ నేమ్ రాకుండా జాగ్రత్త పడింది. ఈ క్రమంలోనే బెల్టు షాపులు వద్దని.. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చాలా చాలా దూరంగా ఉండాలని కూడా.. చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ నాయకులకు క్లాస్ ఇచ్చారు.
కానీ, నాయకులు చంద్రబాబు చెప్పిన మాటలను విని.. వదిలేశారు. తమ పద్ధతిలో తాము నడుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తుని సహా పలు నియోజకవర్గాల్లో ఆదివారం సంతలు నిర్వహిస్తారు. ఈ సంతలు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారు. వీటిలో బహిరంగంగానే మద్యాన్ని పెట్టి విక్రయించారు. ఇవన్నీ బెల్టు షాపులు. పైగా వీటిని పెట్టిన వారు కూడా టీడీపీ సానుభూతిపరులు. అంటే.. కీలక నేతలే వీటిని పెట్టించారనే విషయం ఇక్కడ చర్చగా మారింది. వారి అండ లేకపోతే.. ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు.
ప్రస్తుతం ఈ బెల్టు షాపులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మరి దీనిని బట్టి.. చంద్రబాబు చెప్పింది.. నాయకులకు అర్థం కావడం లేదా? లేక.. బాబు ఏం చెప్పినా.. తాము చేయాల్సింది చేయాలని అనుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇది కదా.. బాబుకు బ్యాడ్ నేమ్ తీసుకురావడం అంటే! అనే కామెంట్లు మాత్రం టీడీపీ సానుభూతి పరుల నుంచి వినిపిస్తున్నాయి.