కన్నడ రామయ్య సీఎం కుర్చీకి ఎసరు ?

అయితే ఇది ఈ రోజు వ్యవహారం కాదు దీని కంటే ముందు జూలై 26న కూడా గవర్నర్ గెహ్లాట్ సిఎం సిద్ధరామయ్యకు సీరియస్ షోకాజ్ నోటీసును జారీ చేశారు.

Update: 2024-08-18 03:49 GMT

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏడున్నర పదుల వయసులో ఇదే చివరి చాన్స్ అని కాంగ్రెస్ హై కమాండ్ అభిమానం పొంది ముఖ్యమంత్రిగా ఏణ్ణర్థం క్రితం గద్దెనెక్కారు. ఆయనకు పక్కలో బల్లెం లా డీకే శివకుమార్ ఉన్నా అయిదేళ్ల పాటు తానే సీఎం అని ధీమాగా ఉన్నారు. కానీ తన సీఎం సీటుకు ఎసరు పెట్టడానికి బీజేపీ రెడీ అయిపోయిందని తెలుసుకోలేకపోయారు అంటున్నారు.

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇచ్చేశారు. ఇంతకీ సిద్ధరామయ్య చేసిన తప్పేంటి అంటే మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థలం కేటాయింపు విషయంలో కుంభకోణానికి పాల్పదారని అంటున్నారు. దాంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధం చేశారు.

అయితే ఇది ఈ రోజు వ్యవహారం కాదు దీని కంటే ముందు జూలై 26న కూడా గవర్నర్ గెహ్లాట్ సిఎం సిద్ధరామయ్యకు సీరియస్ షోకాజ్ నోటీసును జారీ చేశారు. మిమ్మల్ని ఎందుకు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోకూడదో ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ షోకాజ్ నోటీసులో కోరారు.

దాని మీద కర్నాటక మంత్రివర్గం సమావేశం అయి సిద్ధరామయ్యకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ని తప్పు పట్టింది. గవర్నర్ తన రాజ్యాంగ పాత్రను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి గెహ్లాట్ జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కర్ణాటక మంత్రివర్గం ఒక విధంగా చెప్పాలీ అంటే గట్టిగా సిఫార్సు చేసింది.

అది జరిగి పదిహేను రోజులు అయింది అనుకుంటే సడెన్ గా గవర్నర్ సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ కి సిద్ధం కమ్మని అనుమతి ఇచ్చేశారు. ఇక మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తన కుటుంబనికి ప్రత్యామ్నాయ స్థలాలను పొందడానికి సిద్ధరామయ్య అవకతవకలు చేశారని, 55.8 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా పొందారని పిటిషనర్లు ఆయన మీద గవర్నర్ కి ఫిర్యదు చేశారు. ఇది పెద్ద కుంభకోణం అని కూడా వారు ఆరోపించారు.

2013 ఎన్నికల అఫిడవిట్‌లో సిద్ధరామయ్య తన భార్యకు తన సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా ప్రకటించలేదని కూడా వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ముడా స్వాధీనం చేసుకున్న కేసరే గ్రామంలోని భూమికి బదులుగా సిద్ధరామయ్య భార్య పేరిట మైసూరులో 14 స్థలాలను పొందారన్నది అభియోగం.

మరోవైపు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ ఈరోజు విరుచుకుపడింది. ఆయన తప్పకుండా విచారణకు సిద్ధం కావాల్సిందే అని డిమాండ్ చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర దీని మీద మాట్లాడుతూ సిద్ధరామయ్య మీద ఫైర్ అయ్యారు.

ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం అని ఆయన అన్నారు. ఈ కేసులో ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను బిజెపి నాయకుడు ప్రశంసించారు.

మరో వైపు చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పదవులపై రాజకీయం జరుగుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఈ కేసులో ఏమీ లేదని అన్నారు. మొత్తానికి చూస్తే సిద్ధరామయ్య ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రాసిక్యూషన్ అంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాల మీద కోర్టుకు కాంగ్రెస్ వెళ్తోంది. మరి అక్కడ ఏమి తేలుతుందో చూడాలి. ఏది ఏమైనా సిద్ధరామయ్య కుర్చీ కిందకు నీళ్ళు తోసుకుంటూ వస్తున్నాయనే అంటున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు